కలం, వెబ్ డెస్క్ : మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసు (Wrestlers Case)లో భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) మాజీ అధ్యక్షుడు, మాజీ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు పెద్ద ఊరట లభించింది. ఈ కేసులో ఆయనతో పాటు సహ నిందితుడు వినోద్ తోమర్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును వినడానికి బ్రిజ్ భూషణ్ స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ప్రాంగణంలోకి వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోర్టు ఏం చెబుతుందో వినడానికి మాత్రమే తాను వచ్చానని, అంతా న్యాయస్థానం చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించారు.
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసు, భారత అగ్రశ్రేణి రెజ్లర్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసింది. క్రీడాకారుల రక్షణ, జవాబుదారీతనం, క్రీడా సమాఖ్యల నిర్వహణపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు కారణమైన ఈ సుదీర్ఘ వివాదానికి తాజా కోర్టు తీర్పుతో ఒక ముగింపు లభించినట్లయింది.

