కట్నం వేధింపుల కేసు.. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో NRI భర్త అరెస్ట్!

కలం, ఖమ్మం బ్యూరో: కట్టుకున్న భార్య నల్లగా ఉందంటూ అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేయడమే కాకుండా, భార్యా కూతుళ్ల పాస్‌పోర్టులు లాక్కొని విదేశాలకు పారిపోతున్న ఓ ఎన్‌ఆర్‌ఐ భర్తను ఖమ్మం పోలీసులు (Khammam Police) చాకచక్యంగా పట్టుకున్నారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని, ఖమ్మం తరలించి రిమాండ్‌కు పంపారు.

​వివరాల్లోకి వెళ్తే.. ​ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలుకు చెందిన వెంకట నవీన్ సాయి చంద్ అనే యువకుడికి, ఖమ్మం నగరానికి చెందిన ఓ యువతితో నాలుగేళ్ల క్రితం ఘనంగా వివాహం జరిగింది. నవీన్ సాయి చంద్ కెనడాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వివాహ సమయంలో కట్నకానుకలు భారీగానే సమర్పించారు. పెళ్లయిన కొత్తలో బాగున్నప్పటికీ, వీరికి ఓ కూతురు జన్మించిన తర్వాత భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. ​భార్య నల్లగా ఉందంటూ నిత్యం మానసికంగా, శారీరకంగా వేధించడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధింపుల తీవ్రతను పెంచాడు. ఈ క్రమంలోనే భార్య, కూతురుకు సంబంధించిన పాస్‌పోర్టులను తన ఆధీనంలోకి తీసుకుని, వారిని ఇక్కడే వదిలేసి కెనడాకు పారిపోయేందుకు పక్కా ప్లాన్ వేశాడు.

​భర్త తనను వదిలించుకుని విదేశాలకు పారిపోతున్నాడని గ్రహించిన బాధితురాలు అత్యవసరంగా ఖమ్మం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కదలికలపై నిఘా పెట్టారు. అతడు చెన్నై విమానాశ్రయం గుండా కెనడాకు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. ​వెంటనే స్పందించిన ఖమ్మం పోలీసులు లుకౌట్ నోటీసుల ఆధారంగా చెన్నై ఎయిర్‌పోర్ట్ ఇమ్మిగ్రేషన్ అధికారుల సహాయంతో నిందితుడు వెంకట నవీన్ సాయి చందును అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నుంచి ఖమ్మంకు తరలించి, శనివారం నిందితుడిని కోర్టు ఎదుట హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. మహిళలపై వేధింపులకు పాల్పడితే ఎంతటి వారైనా చట్టం ముందు తలవంచాల్సిందేనని, బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>