కలం, వెబ్ డెస్క్: ఫ్యూచర్ సిటీపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. “హరీశ్ రావు.. బీఆర్ఎస్‌లో మీ ఫ్యూచర్ ఏంటో మీకే తెలియదు.. అలాంటి మీరు ఫ్యూచర్ సిటీని ఆపుతారా?” అని ఘాటుగా స్పందించారు. అమెరికాలో ఉండి ఫ్యూచర్ సిటీని ఆపేస్తామని హరీశ్ రావు ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భూములను తాకట్టు పెట్టడానికి అమెరికాలో ఎవరితోనైనా ఒప్పందం చేసుకున్నారా? అంటూ ప్రశ్నించారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌లో కనీసం ఒక్క మెట్రో స్టేషన్ కూడా కట్టలేదన్నారు. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఒక నగరమే నిర్మిస్తున్నది అంటే అసూయ కలగక తప్పదు అని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల కోసం ఎక్కడ పడితే అక్కడ ఫాంహౌస్ లు కట్టుకున్నారని ఆరోపించారు. కానీ తాము రాష్ట్రం కోసం, దేశం కోసం ఫ్యూచర్ సిటీ కడుతుంటే ఆపుతాం అంటున్నారని దుయ్యబట్టారు. మూసీని బాగుచేస్తామంటే అడ్డుపడుతున్నారు, లగచర్లలో ఇండస్ట్రీస్ పెట్టి యువతకు ఉద్యోగాలిస్తామంటే కుట్రచేసారు, ఇప్పుడు ఫ్యూచర్ సిటీని ఆపుతాం అంటున్నారు అంటూ ఫైర్ అయ్యారు.
ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. దేశం గర్వించే విధంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తుందని పొంగులేటి ఆశాభావం వ్యక్తం చేశారు. హరీశ్ రావు రాజకీయ భవిష్యత్తును ఖతం చేయాలని కేసీఆర్, కేటీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. ఫ్యూచర్ లేని బీఆర్ఎస్ పార్టీ నుండి హరీశ్ రావు తొలగిపోయి తమ ఫ్యూచర్ కాపాడుకోవాలని సూచించారు. బీఆర్ఎస్‌కు ఫ్యూచర్ లేదని.. ఫ్యూచర్ సిటీకి తిరుగులేదని మరోమారు స్పష్టం చేశారు.

