కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ (Hyderabad)లో దారుణ ఘటన చోటుచేసుకున్నది. మాసబ్ ట్యాంక్ పరిధిలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రముఖ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ (Khaja Moinuddin) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్వాస విడిచారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఖలీ ఖాజా మొయినుద్దీన్ తన నివాసం నుంచి బయటకు వచ్చిన వెంటనే దుండగులు వేగంగా కారుతో ఆయనను ఢీకొట్టారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారు. రక్తపు మడుగులో ఉన్న ఆయనను స్థానికులు తక్షణమే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆయన ప్రాణాలు కోల్పోయారు.
ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ప్రారంభంలో దీనిని సాధారణ హిట్ అండ్ రన్ కేసుగా భావించినప్పటికీ, ప్రాథమిక ఆధారాలు చూశాక పోలీసులు దీనిని పథకం ప్రకారం చేసిన హత్యగా నిర్ధారించారు. దీంతో సెక్షన్లను మార్చి హత్య కేసుగా నమోదు చేశారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి విచారణను వేగవంతం చేశారు.

