కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా మంత్రులు (Khammam Ministers) వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. కానీ కొంత మంది మాత్రం వివాదాలే కాదు.. విధానపరమైన నిర్ణయాలలో కూడా జిల్లా మంత్రులు అగ్రస్థానంలో నిలుస్తున్నారని వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. అందులో భాగంగానే ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో, నిర్మాణంలో ఖమ్మం జిల్లా టాప్‌లో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అభివృద్ధి పనుల కోసం నిధుల కేటాయింపులో, మంజూరులో కూడా ఖమ్మం జిల్లా ముందంజలో ఉందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మల్లు ఇటీవల కాలంలో నైనీ కోల్ బ్లాక్ వివాదంలో ఇరుక్కున్నారు. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నైనీ కోల్ బ్లాక్ టెండర్లను దక్కించుకోవడానికి రాష్ట్ర మంత్రులకు సంబంధించిన వారు, ప్రముఖ మీడియా సంస్థల యాజమాన్యానికి సంబంధించిన వారు, పోటీ పడ్డ విషయం బహిరంగ రహస్యమే. ప్రధానంగా టెండర్ ప్రక్రియలో ప్రవేశపెట్టిన సైట్ విజిట్ వంటి నిబంధనలు పక్షపాతంగా ఉన్నాయని, కొంత మందికి మేలు చేసేలా ఉన్నాయని రాజకీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మీడియా సంస్థలను ఉద్దేశించి క్లారిఫికేషన్ తీసుకుని వార్తలు ప్రచురించాలని కోరారు.
వివాదం ముదరక ముందే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కోల్ బ్లాక్ టెండర్లలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రాకూడదనే ఉద్దేశంతో, వారికి తమ ప్రభుత్వ చిత్తశుద్ధి తెలియడానికి టెండర్లను రద్దు చేస్తున్నానని ప్రకటించారు. వేగంగా తీసుకున్న ఈ విధాన నిర్ణయం మూలంగా రాజకీయంగా పెను దుమారం రేగాల్సిన అంశం సద్దుమణిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
భూదాన్ భూములతో తుమ్మలపై అపవాదు
ఖమ్మం శాసనసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) కూడా, వెలుగుమెట్ల భూదాన్ భూములకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొన్నారు. మంత్రి బినామీల కోసం పేదలను నిరాశ్రయులను చేశారనే అపవాదు మూటగట్టుకున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బంధువు అనారోగ్యం కారణంగా దుబాయ్ వెళ్లడం, యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకోవడంతో విమర్శలు తారా స్థాయికి చేరాయి. దీనికి తోడు రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షంతో పాటు అన్ని పార్టీల నేతలు ఖమ్మం చేరుకొని బాధితులకు సంఘీభావం తెలిపారు. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన ముగ్గురు మంత్రులు 15 రోజుల వ్యవధిలోనే సమస్యను పరిష్కరించి, నిర్వాసితులకు కూల్చిన చోటనే ఇళ్ల పట్టాలు ఇచ్చి, నిర్మాణం చేపట్టి శభాష్ అనిపించుకున్నారు.
పొంగులేటిపై అక్రమ మైనింగ్ ఆరోపణలు
ఖమ్మం జిల్లా పాలేరు నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy)పై అక్రమ మైనింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండలం, మానస హిల్స్ కొత్వాల్ గూడ ప్రాంతాల్లో రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్ చేసిందని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు బారీగా గండి పడిందని ఆరోపణలు వచ్చాయి. వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించి, ప్రభుత్వ నిబద్ధతను చాటారు. మరో పక్క రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ప్రతినిధులు కూడా మంత్రి పొంగులేటి కుటుంబానికి ఈ కంపెనీతో సంబంధం లేదంటూ తోసిపుచ్చారు. అలాగే వట్టి నాగుల పల్లి భూముల విషయంలో కూడా ఈ కంపెనీ పేరు వినిపించినప్పటికీ, అక్కడి భూ యజమానులు ఇది తమ కుటుంబ వివాదమని, ఇందులో మంత్రికి గానీ, రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు గానీ సంబంధం లేదని స్పష్టం చేశారు. మొత్తంగా ప్రభుత్వం ఒక వైపు విచారణ జరుపుతూనే మంత్రికి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం మీద ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు (Khammam Ministers) రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టించిన వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ, ఎలాంటి అవాంతరాలు లేకుండా బయటపడడానికి కారణం వారు తీసుకున్న విధానపరమైన నిర్ణయాలే అని జిల్లా ప్రజలతో పాటు కాంగ్రెస్ వర్గాలు కూడా చెప్పుకుంటున్నాయి.
Read Also: టైటిల్ కోసం అన్నా చెల్లెళ్ల ఫైట్.. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ
Follow Us On : WhatsApp

