కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రాజెక్టుకు జాతీయ హోదా (National Project Status) కోసం ప్రధాని మోదీకి లెటర్ రాసి పట్టుపట్టాలని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి (Palamuru Rangareddy) ప్రాజెక్ట్ కోసం న్యాయబద్ధమైన డిమాండ్ ను తాము చేస్తూనే ఉన్నామని కవిత వివరించారు. కృష్ణా నది 3 వందల కిలోమీటర్లు పారుతున్న సరే మహబూబ్ నగర్ జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడి ఉందన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పరిస్థితే ఉన్న కర్ణాటకలోని అప్పర్ భద్రకు మాత్రం జాతీయ హోదా ఇచ్చారని విమర్శించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాలని డిమాండ్ చేశారు. పుష్కరాల నాటికి పోలవరం పూర్తి కావాలంటూ కేంద్ర ఇరిగేషన్ మంత్రి వద్దకు చంద్రబాబు వెళ్లారని.. తమ గురువును చూసైన రేవంత్ రెడ్డి బుద్ది తెచ్చుకోవాలని అన్నారు.
మనం వెనుకబడి ఉన్నాం..
పోలవరం ప్రాజెక్ట్ వద్దకు చంద్రబాబు ఐదుసార్లు వెళ్లారని.. పనులు వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఒక్కసారి కూడా పాలమూరు ప్రాజెక్ట్ వద్దకు వెళ్లలేదని.. ఇప్పటివరకు రివ్యూ చేయలేదన్నారు. పవర్ ప్రాజెక్ట్ అయిన శ్రీశైలంలో కూడా 331 టీఎంసీలు వాడుకునేలా ఆంధ్రావాళ్లు వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. గోదావరిలో 964 టీఎంసీల నీళ్లు వాడుకునే అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజలు 220 టీఎంసీలు మాత్రమే వాడుకున్నమని వివరించారు. దీన్ని బట్టే నీళ్ల విషయంలో ఆంధ్రావాళ్లతో పోల్చుకుంటే మనం ఎంత వెనుకబడి ఉన్నామో అర్థం చేసుకోవచ్చని చెప్పారు.
50 శాతం నీళ్లను కూడా వాడుకోలేదు..
ప్రతి ప్రాజెక్ట్ వద్ద 3 అల్టర్ నేట్ లను పెట్టుకున్నారని.. సుంకేశులను బారాజ్ చేసుకున్నారని అన్నారు. చెన్నైకి నీళ్లు అని చెప్పి అక్కడకు వెళ్లే కాలువలను డబుల్ చేసుకున్నారని చెప్పారు. శ్రీశైలంలో బురద నీళ్లను కూడా తీసుకునేందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకున్నారని తెలిపారు. తెలంగాణ లక్షా 89 వేల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖర్చు చేసిందని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భారీగా ఖర్చు చేస్తోందని చెప్పారు. కానీ గోదావరిలో పావు, కృష్ణాలో 50 శాతం నీళ్లను కూడా మనం సరిగ్గా వాడుకోలేదని మండిపడ్డారు.

