తెలంగాణ వాళ్ల‌కు ఉద్యోగాలిస్తేనే స్కూల్‌కు ప‌ర్మిష‌న్లు: క‌విత

క‌లం, వెబ్ డెస్క్‌: తెలంగాణ వాళ్ల‌కు ఉద్యోగాలు ఇవ్వ‌ని స్కూళ్ల‌కు ప్ర‌భుత్వం ప‌ర్మిష‌న్లు ఇవ్వొద్ద‌ని జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత (Kavitha) డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్త కొత్త కార్పొరేట్ స్కూల్స్ మాత్ర‌మే కాకుండా ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన వాళ్లు స్కూల్స్ పెడుతున్నార‌ని క‌విత అన్నారు. అలెన్, ఎక్స్ లెన్స్, రెజిలెన్స్, ఫిజిక్స్ వాలా అంటూ నార్త్ స్కూల్స్ పెడుతూ.. వాటిలో ఉత్త‌రాది వాళ్ల‌కే ఉద్యోగాలు ఇస్తున్నార‌ని ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం వీటిపై దృష్టి పెట్టాల‌ని, తెలంగాణ వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వని స్కూల్స్‌కు అస‌లు అనుమ‌తులే ఇవ్వొద్ద‌ని సూచించారు. అవసరమైతే తెలంగాణ ఉద్యమకారులకు పర్మిషన్లు ఇవ్వాల‌ని, వాళ్ల‌యినా స్కూల్స్ పెట్టుకొని బ‌తుకుతార‌ని చెప్పారు.

రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ స్కూల్స్ బాగా లేవన్న‌ద‌ని త‌న ఉద్దేశం కాద‌ని, కొన్ని స్కూల్స్ పిల్లలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాయ‌ని క‌విత (Kavitha) స్ప‌ష్టం చేశారు. పేరెంట్స్‌కు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా వారిని పురుగుల్లా చూస్తున్న స్కూల్స్‌పై చర్యలు తీసుకోవాల‌ని కోరారు. నారాయణ, చైతన్య లాంటి స్కూల్స్ ఏటా 15 వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాయ‌ని క‌విత అన్నారు. కానీ, రకరకాల పేర్లతో ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నార‌ని ఆరోపించారు. ఇవి చాల‌వ‌న్న‌ట్లు దోబీ, ఫుడ్, పుస్తకాలు ఇలా దేనికి తెలంగాణ‌ వాళ్లకు అవకాశం ఇవ్వటం లేద‌ని చెప్పారు. 2 వేల రూపాయల పుస్తకాలకు 15 వేలు వసూలు చేస్తున్నార‌ని ఆరోపించారు. నారాయణ, చైతన్య స్కూల్స్ వాళ్లకు ప్రత్యేకంగా ప్రింటింగ్ యూనిట్స్ ఉన్నాయ‌ని చెప్పారు. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం దీన్ని ఏమాత్రం ప‌ట్టించుకోలేద‌ని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తోంద‌ని విమ‌ర్శించారు.

ఇక‌ విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రే ఉండటం మన ఖర్మ అంటూ క‌విత వ్యాఖ్యానించారు. ఎన్నికల వరకు విద్యార్థుల అంశాన్ని రేవంత్ రెడ్డి వాడుకున్నాడ‌ని విమ‌ర్శించారు. గురుకులాల్లో విద్యార్థులు చనిపోతే కూడా కనీసం రివ్యూ చేయటం లేద‌న్నారు. బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు త‌న‌ను నిజామాబాద్ వరకే పరిమితం చేశార‌ని, అయినప్పటికీ మన తెలంగాణ వాళ్లకు అన్యాయం జరగవద్దని నిజామాబాద్ జిల్లాకు నారాయణ, చైతన్య స్కూల్స్ ను రానివ్వలేద‌ని తెలిపారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిజామాబాద్‌ జిల్లాకు కూడా ఆ స్కూల్స్ వచ్చేశాయ‌న్నారు. ప్రభుత్వ పరంగా ఈ అంశంపై కచ్చితంగా ఒక స్టాండ్ తీసుకోవాల‌ని సూచించారు. స్కూల్స్ లో ఎంప్లాయిమెంట్ విషయంలో తెలంగాణ‌ వాళ్లకు అవకాశం వచ్చేలా చర్యలు తీసుకోవాల‌న్నారు. ప్రైవేట్ స్కూల్స్‌లో వేలాది మంది చాలా తక్కువ జీతాలకు పని చేస్తున్నార‌ని, వారికి అన్యాయం జరగకుండా పోరాటం చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

Read Also: దొడ్డి కొమురయ్య నేటి తరాలకు స్ఫూర్తిదాయకం : మంత్రి రాజనర్సింహ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>