భద్రాచలం వద్ద 5 గ్రామాలను పట్టుకురండి.. బీజేపీ ఎంపీలకు కవిత సవాల్

కలం, వెబ్ డెస్క్: బీజేపీకి తెలంగాణ రావటమే ఇష్టం లేదని తెలంగాణ రాష్ట్ర సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత (Kavitha) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (TRS)గా ప్రకటించి 5 హామీలతో పాంచజన్యం పూరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తల్లిని చంపి బిడ్డను తీశారని బీజేపీ పెద్దలు అంటారని గుర్తు చేశారు. మెడకాయ మీద తలకాయ లేని ఒక ఎంపీ తెలంగాణను భారత్ పాక్ విభజనతో పోల్చుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రనాయకత్వం అలా మాట్లాడితే బీజేపీ బానిస ఎంపీలు ఒక్క మాట్లాడరు అంటూ రాష్ట్ర బీజేపీ ఎంపీలపై ఫైర్ అయ్యారు.

మనకు ఒక్క రూపాయి ఇవ్వకపోయిన సరే మన బీజేపీ ఎంపీలు మాట్లాడరని.. సామాజిక న్యాయం అనే దానికే బద్ద వ్యతిరేకి బీజేపీ అని మండిపడ్డారు. బీజేపీ నేతలు మహిళ బిల్లు పక్కన పెట్టారని.. బీసీ బిల్లు, కులగణన బిల్లు తొక్కి పెట్టారని ఫైర్ అయ్యారు. పేదలకు కూడు పెట్టే ఉపాధి హామీని పక్కన పెట్టారని అన్నారు. ఫెడరల్ స్ఫూర్తిని పక్కన పెట్టి మన ఏడు మండలాలు తీసుకున్నారని.. అయిన సరే ఈ బీజేపీ బానిస ఎంపీలు పెదవులు తెరవరు అంటూ దుయ్యబట్టారు. ‘ఈ బీజేపీ బానిస ఎంపీలకు నేను సవాల్ చేస్తున్నా.. మీరు తెలంగాణ బిడ్డలైతే భద్రాచలం వద్ద ఐదు గ్రామాలను తెలంగాణకు పట్టుకురండి’ అంటూ సంచలన సవాల్ చేశారు. పోలవరం పూర్తయితే ఆ గ్రామాలు మునిగిపోతాయన్నారు.

వారికి పేరుపేరునా నమస్కారం..

తొలుత తన పార్టీ పేరును “తెలంగాణ రాష్ట్ర సేన (Telangana Rashtra Sena)” గా కవిత ప్రకటించారు. తెలంగాణ ప్రజలు, మేధావులు, బుద్ది జీవులు, తెలంగాణ అభివృద్ధి కోరుకునే వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. తన జీవితంలో ఇదొక మరుపురాని రోజు అని.. మనందరం కలుసుకొని పనిచేసే విధంగా ఆ దైవం చేసిందని నమ్ముతున్నానన్నారు. తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు, అనేక రకాల కష్టాలు పడినవారు, రాష్ట్రం ఆవిర్భవిస్తే చాలని భావించిన వాళ్లకు నమస్కారం తెలియజేశారు. సింగరేణి కార్మికులంటే తనకు ఇష్టమని, అంతకన్నా ఆడబిడ్డలంటే ఇంకా ఇష్టమని ఆమె పేర్కొన్నారు. జెన్ జీ వారసులు, యూత్ కు పేరు పేరున నమస్కారం తెలియజేశారు.

కవిత మాట్లాడుతూ.. “ఏం జరుగుతుందని ఇవ్వాళ రాష్ట్రంలో చాలా మంది ఎదురుచూస్తున్నారు. 20 ఏళ్లుగా నేను, తెలంగాణ జాగృతి పోషించిన పాత్ర మీకు తెలుసు. ఆడబిడ్డలందరినీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేలా ఊరురా బతుకమ్మ కార్యక్రమం చేశాం. జాగృతి ఆడబిడ్డల చేతిలో కాగడ అయ్యింది. మన సంస్కృతి గురించి చెప్పుకోవటానికి బతుకమ్మ వచ్చాక బలం వచ్చింది. ఇది మా సంస్కృతి అని బతుకమ్మ పాట ద్వారా పునః పరిచయం చేసకున్నాం. తెలంగాణ ఉద్యమానికి బలమైన పునాది వేసింది మా జాగృతి ఆడబిడ్డలు. కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ మనం కలలు కన్నా తెలంగాణ రాలేదు. మన కలలు ఇప్పటికీ కూడా నిజం కాలేదు. కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ రథం దారి తప్పింది. సామాజిక రథ చక్రం విరిగి ముక్కలైంది. ఏ తరహాలో పనిచేయాలో అలా జరగలేదని చెప్పటానికి బాధగా ఉంది. ఇసుక దందా మీద ప్రేమతో దళితుల చావులు అయ్యాయి. ఫోన్ మాట్లాడాలంటే భయం. దారుణమైన నిఘా నీడలో మనం బతికాం. మనం అనుకున్న తెలంగాణ రాలేదని మీకు చెబుతున్నా. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో భాగమైనందుకు సిగ్గుపడుతున్నా. తెలంగాణ సాధించటంలో భాగమైనందుకు నా జన్మ ధన్యమైంది. నా తప్పులకు భాగస్వామ్యం ఉందన్న దానికి కేవలం క్షమాపణ చెబితే సరిపోదు. ఆ తప్పులను దిద్దుకోవటానికి కష్టపడి పనిచేయాలి. అందుకోసమే మేము తెలంగాణ రాష్ట్ర సేనగా వస్తున్నాం. పోరాటాలకు రాజకీయ శక్తి, అధికారం ఉంటే ఇంకా బాగా పనిచేయవచ్చు” అని వ్యాఖ్యానించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>