కలం డెస్క్ : బీఆర్ఎస్ పాలనలోని అవినీతిని, దానికి పాల్పడిన నాయకులను పేరు పెట్టి మరీ హెచ్చరించిన కల్వకుంట్ల కవిత(Kavitha) మున్ముందు ఒక్కొక్కరి చిట్టా బహిర్గతం చేస్తానని హెచ్చరించారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు భూకబ్జా భాగోతం, కేటీఆర్‌కు బినామీగా ఉన్న పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ హయాంలో హరీశ్‌రావు భూములకు కన్వర్షన్ ఉత్తర్వులు రావడం.. వీటన్నింటి బండారాన్ని బైటపెట్టుడు ఖాయమన్నారు. “ఇప్పటివరకు నేను వెల్లడించిన వివరాలన్నీ కేవలం టాస్ మాత్రమే… టాస్‌లో గెలిచాను.. ఇక ముందున్నది అసలు టెస్ట్ మ్యాచ్‌లు… ఆట ఆడేది మస్తుగున్నది… అంటూ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ పంచన చేరిన పందికొక్కులెవరో, గుంట నక్కలెవరో.. వీరందరినీ ప్రజల మధ్య నిలబెడతా… విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తా… సీబీఐ దర్యాప్తును కోరుతా..” అంటూ మండిపడ్డారు.
అల్లుడి ఫోన్ ట్యాపింగ్.. సిగ్గుండాలి :
“పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నడైనా నా భర్త పేరు బైటకొచ్చిందా?.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేసీఆర్, కేటీఆర్, మంత్రుల దగ్గరకి వచ్చి ఏనాడైనా ఏదైనా అడిగాడా?.. ‘ఔట్ ఆఫ్ ది వే’ కోసం ఎప్పుడైనా రిక్వెస్టు చేశారా?.. ఇంతకాలం నా భర్త పేరు వినిపించని పరిస్థితుల్లో ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎందుకు ఫోటోలు చూపెట్టి నిందలేస్తున్నారు?.. ఆధారాల్లేకుండా, వాస్తవాల్లేకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేద”ని కవిత (Kavitha) వార్నింగ్ ఇచ్చారు. సహనంతో ఉండడానికి తాను మహాత్మాగాంధీని కాదన్నారు. “ఇంటి అల్లుడి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ప్రభుత్వానికి సిగ్గుండాలి… కేటీఆర్ నా భర్త ఫోన్‌ను ట్యాపింగ్ (Phone Tapping) చేయించిండు… దొంగచాటుగా మాటలు వినడానికి సిగ్గనిపిస్తలేదా?.. ఇప్పుడు ఒక్కొక్కటి నాకు తెలుస్తున్నయ్.. పదేండ్లలో ఏనాడూ పార్టీ నాకు సహకరించలేదు.. నన్ను ఒక్క జిల్లాకు పరిమితం చేశారు…” అంటూ ఆవేదనను వ్యక్తం చేశారు.
నగలు కుదువపెట్టి ‘బతుకమ్మ’ చేసిన :
“అమెరికాలో ఉన్న నేను, నా భర్త 2004లో తెలంగాణ ఉద్యమం కోసం వచ్చాం… పార్టీ నుంచి మాకు ఎలాంటి సపోర్టు కూడా లేదు.. సాంస్కృతిక భావజాల వ్యాప్తి ద్వారా తెలంగాణ మహిళలను ఉద్యమంలో భాగం చేయాలనుకున్నా.. ఇందుకు బతుకమ్మ సంబురాలను ఎంచుకున్నా.. ఒక దశలో నా నగలను కుదువపెట్టి మరీ ఉత్సవాలను నిర్వహించా… నా భర్త వ్యాపారమే మా కుటుంబానికి సపోర్టు… బీఆర్ఎస్ నేతల్లాగా మేం ప్రజల సంపదను దోచుకోలేదు.. భూముల్ని కబ్జా చేయలేదు.. మా ఇద్దరి మీద చేస్తున్న ఆరోపణల్లో నిజముంటే ఆధారాలతో బైట పెట్టొచ్చు..” అంటూ తనదైన శైలిలో గులాబీ లీడర్లను హెచ్చరించారు.
Read Also: డీకే విందులో బీజేపీ ఎమ్మెల్యేలు!
Follow Us On: Instagram


