కలం డెస్క్: Akhanda 2 Review | బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న మూవీ అఖండ 2. ఓ సారి వాయిదా పడ్డ తర్వాత డిసెంబర్ 11న ప్రీమియర్స్ తో రిలీజ్ అయింది ఈ మూవీ. భారీ అంచనాలతో వచ్చిన అఖండ 2 (Akhanda 2)లో బాలకృష్ణ అఘోరా పాత్ర గురించే హైప్ ఉంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా, ఆది పినిశెట్టి విలన్ గా నటించారు. ట్రైలర్ తో భారీ అంచనాలు రేపిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ..
అఖండ మొదటి పార్టు అయిపోయిన దగ్గరి నుంచే ఈ రెండో పార్టును మొదలు పెట్టారు. ఫస్ట్ హాప్ ను చిన్న ట్రైలర్ రూపంలో చూపించిన తర్వాత.. రెండో పార్టు స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఫస్ట్ పార్టులో లోకల్ విలన్లు ఉంటే.. ఈ రెండో పార్టులో చైనాను విలన్ గా చూపించారు. చైనా ఆర్మీ జనరల్(సంగయ్ షెల్ట్రిం) ఇండియా మీద పగతీర్చుకోవాలని చూస్తుంటాడు. చైనాకే చెందిన చాంగ్ అనే మాజీ జనరల్ తో కలిసి ఇండియా మీద బయో వార్ జరుపుతాడు. మహా కుంభమేళాకు ఎక్కువ మంది వచ్చే గంగానదిలో ఒక వైరస్ ను ప్రవేశపెడుతాడు. దీనికి ఇండియాకే చెందిన ఓ పొలిటికల్ లీడర్ సాయం చేస్తాడు. వందల మంది చనిపోతారు. ఆ వైరస్ కు అనంతపురంకు చెందిన బాలమురళి కృష్ణ(బాలకృష్ణ) కూతురు(హర్షాలి) వ్యాక్సిన్ కనిపెడుతుంది. ఆ వ్యాక్సిన్ ప్రజలకు అందకుండా సదరు పొలిటికల్ లీడర్, మాంత్రికుడు విసూచి(ఆది) కలిసి కుట్రలు చేస్తుంటారు. అప్పుడు హర్షాలి పెదనాన్న బాబా(బాలకృష్ణ) ఎంట్రీ ఇస్తాడు. బాబా ఆ వ్యాక్సిన్ ను ప్రజలకు ఎలా అందజేశాడు, ఆ పోరాటంలో హైందవ, సనాతన ధర్మం గురించి సీన్లు, యాక్షన్, ఎమోషన్ సీన్లను థియేటర్ లో చూడాల్సిందే.
ఎలా ఉందంటే..?
ఈ సినిమాను మొదటి నుంచి సనాతన ధర్మం గురించే ఊహించుకున్నారు. కానీ బోయపాటి ఈ సనాథన ధర్మం కంటే చైనా విలన్లను తీసుకొచ్చి యాక్షన్ మీద ఎక్కువగా ఫోకస్ చేశాడు. మొదట్లో సనాతన ధర్మం గురించి చూపించడంతో బాగానే అనిపిస్తుంది. కానీ తొందరగానే చైనా ఆర్మీ ఆఫీసర్లను తీసుకురావడం, ఆ తర్వాత వైరస్, బాలయ్య ఎంట్రీ, ఆయన రకరకాల భాషలు మాట్లాడటం, యాక్షన్ సీన్లు భారీగా ఉండటంతో సనాతనం పక్కకు వెళ్లిపోతుంది. కథలో ఎప్పుడైనా ఒక కోణం ఎంచుకుంటే దాన్ని సెంటర్ ఆఫ్ పాయింట్ గా చేసుకుని కథ రాసుకోవాలి. ఇక్కడే బోయపాటి రకరకాల పాయింట్లను తీసుకోవడం కొంత గందరగోళానికి దారి తీస్తుంది. కానీ మధ్య మధ్యలో సనాతన ధర్మం గురించి చెప్పే డైలాగులు, సీన్లు బాగున్నాయి.
బాలకృష్ణ అఘోరా పాత్రకు తగ్గట్టే కొన్ని ఎలివేషన్ సీన్లు ఆకట్టుకుంటున్నాయి. మధ్యలో హీరోయిన్ తో బ్రాండీ తాగడం, రెండు డ్యూయెట్లు కూడా కొంత బోర్ కొట్టించకుండా పెట్టేశాడు బోయపాటి. సినిమా లైన్ విదేశీ కుట్రలను ఒక అఘోరా ఎలా అడ్డుకున్నాడు అనేది.. సనాతన ధర్మంను హైలెట్ చేస్తూ చూపించాలని అనుకున్నాడు బోయపాటి. ప్రేక్షకులు మాత్రం సనాతన ధర్మాన్ని ఎలా ఎలివేట్ చేస్తారో అనే అంచనాలతోనే వెళ్లారు. కాబ్టటి ఈ విషయంలో కొంత డిసప్పాయింట్ అవుతారు. కామన్ ఆడియన్స్ కు కొన్ని యాక్షన్ సీన్లు అతిగా అనిపిస్తాయి. బోయపాటి సినిమాలో లాజిక్స్ వెతికితే ఎక్కదు. కాబట్టి కేవలం మ్యాజిక్స్ ను మాత్రమే ఎంజాయ్ చేయాలి. ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది.
ఎవరెలా చేశారంటే..?
ఇది ఓవరాల్ గా బాలకృష్ణ తాండవం అనే చెప్పాలి. సినిమాను తన భుజాల మీద వేసుకుని నడిపించాడు. ఆయన అఘోరా పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది కాబట్టి.. అందుకు తగ్గట్టే తన నటనతో మెప్పించాడు. అఘోరా పాత్రకు తగ్గట్టు మేకప్, డైలాగులు, ఎక్స్ ప్రెషన్లు బాగానే పలికించాడు. యాక్షన్ సీన్లలో బాలయ్య వీరంగం సృష్టించాడు. ఓ వైపు సనాతన ధర్మం గురించి డైలాగులు చెబుతూ.. అందుకు తగ్గట్టు ఫైట్లు చేయడం హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. మొదటి పార్టులో అఘోరా పాత్ర ఎక్కువసేపు ఉండదు. కానీ ఈ సినిమా పూర్తిగా అఘోరా పాత్ర చుట్టూనే తిరుగుతుంది కాబట్టి.. బాలయ్య ఆ స్థాయిలోనే పర్ఫార్మ్ చేశాడు. సంయుక్త మీనన్, హర్షాలి తమ పాత్రలకు న్యాయం చేశారు. ఆది పినిశెట్టి ఫస్ట్ టైమ్ మాంత్రికుడి పాత్రలో కనిపించాడు. ఒక రకంగా అఘోరా పాత్రకు అతనే సరైన విలన్ గా అనిపిస్తాడు. కానీ అతని పాత్ర కొంచెం ఓవర్ గా అనిపించడం మైనస్ అయింది. చైనా ఆర్టిస్టులు కూడా ఆకట్టుకున్నారు.
టెక్నికల్ గా ఎలా ఉంది..?
బోయపాటి శ్రీనుకు భారీ యాక్షన్ సీన్లు తీయడం అంటే ఇష్టం. దాన్ని ఇందులో మరోసారి చూపించాడు. బాలయ్య చేతికి ఈ సారి త్రిశూలం ఇచ్చి.. సనాతన ధర్మాన్ని, యాక్షన్ సీన్లను కలిపేశాడు. కాకపోతే సనాతన ధర్మాన్ని ఇంకొంచెం హైలెట్ చేసి ఉంటే బాగుండేది. బాలయ్య-బోయపాటి కాంబో అంటేనే ఓ పెద్ద యాక్షన్ డ్రామా, పొలిటికల్ డ్రామాలు అందరూ ఊహిస్తారు. ఇందులో పొలిటికల్ డ్రామా కంటే.. హిందూత్వం, దేశ సెంటిమెంట్ మీద ఫోకస్ పెట్టాడు. కాకపోతే కొన్ని సీన్లు నమ్మేలా ఉండవు. ఎందుకంటే చైనా మన దేశం మీద బయో వార్ జరిపితే దాన్ని దేశ ప్రధానమంత్రి కూడా హ్యాండిల్ చేయలేకపోవడం ఏంటి. ఒక అఘోరా వచ్చి దాన్నంతా చక్కదిద్దుతాడు అనడం సింక్ అవ్వలేదు. దేశంలో ఆర్మీ, పోలీసులు, ప్రభుత్వాల కంటే అఘోరా పవర్ ఫుల్ అన్నట్టు చూపించడం ఎందుకో నమ్మేలా అనిపించట్లేదని ఆడియన్స్ అంటున్నారు. కాకపోతే సినిమా అంటేనే ఇలాంటి లాజిక్స్ ఉండవు. కాబట్టి ఈ సినిమాను లాజిక్స్ వెతక్కుండా చూడాలి. ఇక థమన్ బీజీఎం చంపేశాడు. యాక్షన్ సీన్లు, సనాతన ధర్మం సీన్లలో బీజీఎంకు బాక్సులు బద్దలైపోతాయ్. సాంగ్స్ కూడా ఓకే అనిపిస్తాయి. ఎడిటింగ్ బాగుంది.
చివరగా..
Akhanda 2 Review | సనాతన ధర్మం గురించి అంచనాలు పెట్టుకోకుండా.. లాజిక్స్ వెతక్కుండా చూస్తే ఈ సినిమా ఓకే.
Read Also: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్ కళ్యాణ్
Follow Us On: Instagram


