కలం, వెబ్‌డెస్క్: నీట్ (NEET) పరీక్షా పత్రాల లీకేజీ, పరీక్ష రద్దు, తాజా పరిణామాలపై కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య (Siddaramaiah) కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీట్ పరీక్ష విధానం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది విద్యా వ్యవస్థను బలహీనపరుస్తోందని తమ ప్రభుత్వం 2024లోనే అభ్యంతరాలు వ్యక్తం చేసిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు పరీక్ష రద్దు కావడం తమ ఆందోళనలు నిజమని నిరూపించాయని, విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా తాము చేసిన పోరాటం సరైందేనని సిద్ధరామయ్య పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు దేశ విద్యా వ్యవస్థను ప్రశ్నార్థకం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
ఈ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని సిద్ధ రామయ్య డిమాండ్ చేశారు. నీట్ కుంభకోణం సంపూర్ణ విచారణ జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే కొత్త పరీక్ష షెడ్యూల్‌పై ఎలాంటి అనుమానాలు లేకుండా తక్షణమే స్పష్టత ఇవ్వాలని, ప్రవేశ పరీక్షల నిర్వహణలో రాష్ట్రాలకు ఉన్న స్వయం ప్రతిపత్తిని, అధికారాన్ని తిరిగి పునరుద్ధరించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం మానుకోవాలని హెచ్చరించారు.

