Mobile Popup Ad
Mobile Popup Ad

భవిష్యత్ భారత్‌కు యువతే నిజమైన సంపద: బాలకృష్ణారెడ్డి

కలం, నల్లగొండ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యారంగంలోనూ సమూల మార్పులు అవసరమని, సంస్కరణల ద్వారానే భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడం సాధ్యం అవుతుందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి (Prof Balakrishna Reddy) పేర్కొన్నారు. ‘తెలంగాణ ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాలు’లో భాగంగా బుధవారం నల్గొండ (Nalgonda) జిల్లా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (Mahatma Gandhi University) లో డిగ్రీ అధ్యాపకులకు నిర్వహించిన ‘సిలబస్ సంస్కరణలు – అవగాహన’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాలకృష్ణారెడ్డి (Prof Balakrishna Reddy) మాట్లాడుతూ.. రాబోయే రెండు మూడు దశాబ్దాలు భారతదేశానికి స్వర్ణయుగం లాంటివని, దేశానికి ఉన్న నిజమైన సంపద యువత అని కొనియాడారు. అపారమైన మానవ వనరులను సరైన దిశలో మలిస్తే భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతుందన్నారు. విమానయానం, రక్షణ, విపత్తు నిర్వహణ, సముద్ర పరిశోధన వంటి సరికొత్త రంగాల్లో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయని, విద్యార్థులు వీటిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. డిగ్రీ స్థాయిలో బోధనలో కనీసం 15% నుంచి 20% వరకు టెక్నాలజీని తప్పనిసరిగా సమన్వయం చేయాలని అన్నారు. డిజిటల్ సాధనాలు, ఆన్‌లైన్ వనరుల వినియోగం ద్వారా విద్యార్థులను గ్లోబల్ లీడర్స్‌గా తీర్చిదిద్దాలని సూచించారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) వంటి నూతన పరిజ్ఞానాలను నిరంతరం అధ్యయనం చేస్తూ విద్యారంగాన్ని ఆధునీకరించాలన్నారు.

భవిష్యత్ అవసరాల దృష్ట్యా రూపొందిస్తున్న కొత్త సిలబస్‌లో సాంకేతికత, వ్యవస్థాపకత (Entrepreneurship), చట్టం-విధానం-ప్రభుత్వం, పరిశోధన అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చైర్మన్ వివరించారు. కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా ఇంటర్న్‌షిప్‌లు, ఫీల్డ్ స్టడీస్, కేస్ స్టడీస్, ప్రాజెక్టుల ద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్ అనుభవం అందించేలా మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, వివిధ కళాశాలల అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read Also: హరీశ్ రావు ఆధ్యాత్మిక బాట వెనుక ఆంతర్యమేమిటి!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>