రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా: కరీంనగర్ సీపీ

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే లక్ష్యంగా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ (Karimnagar CP) గౌష్ ఆలం పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా రౌడీ షీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల పనితీరు, డిజిటల్ రికార్డుల నిర్వహణ, క్షేత్రస్థాయి భద్రతా చర్యలపై శనివారం పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

నేపాలీ, ఇతర రాష్ట్రాల కార్మికుల గుర్తింపు తప్పనిసరి..

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుమారు వెయ్యి మంది నేపాలీలు వివిధ రంగాల్లో పనిచేస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయని సీపీ గౌష్ ఆలం (Karimnagar CP) తెలిపారు. వారిలో కేవలం 169 మంది వివరాలు మాత్రమే నమోదయ్యాయని పేర్కొన్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి కూలీలుగా పని చేస్తున్న ప్రతి ఒక్కరి పూర్తి వివరాలు, వారి ఐడీ కార్డులతో సహా పోలీస్ స్టేషన్లలో రికార్డు చేయాలని ఆదేశించారు. యజమానులు సైతం తమ వద్ద పనిచేసే వలస కార్మికుల వివరాలను పోలీసులకు అందించాలని సూచించారు.

కీలకంగా మారబోతున్న CCTNS పోర్టల్‌

భవిష్యత్తులో కేసుల పరిశోధన, ట్రాకింగ్, రికార్డుల పరిశీలనంతా పూర్తిగా క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టం సీసీటీఎన్ఎస్ (CCTNS) పైనే ఆధారపడి ఉంటుందని సీపీ గౌష్ ఆలం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే నమోదయ్యే ప్రతి కేసు పూర్తి వివరాలను నిర్ణీత గడువులోగా ఆలస్యం లేకుండా ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు.

అసాంఘిక శక్తులపై నిఘా కన్ను..

సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులు, రౌడీ షీటర్ల కదలికలపై 24 గంటలూ నిరంతర నిఘా ఉంచాలని సీపీ ఆదేశించారు. పాత నేరస్థుల ప్రవర్తనను నిశితంగా గమనిస్తూ నగరంలో ప్రశాంత వాతావరణానికి భంగం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పోలీస్ స్టేషన్లలోని మాల్ఖానా (కేసులకు సంబంధించిన స్వాధీనపరుచుకున్న సొత్తు, వస్తువుల గది) నిర్వహణ అత్యంత పారదర్శకంగా ఉండాలన్నారు. అందులోని ప్రతి వస్తువు రికార్డుల్లో స్పష్టంగా నమోదు కావాలన్నారు. ఈ సమీక్షలో సీసీఆర్బీ ఏసీపీ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్లు సరిలాల్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో వరంగల్ చిన్నారి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>