కలం, వెబ్ డెస్క్: ఇటీవల మహానాడులో తెలంగాణ (Telangana) టీడీపీ నేత బక్కని నర్సింహులు (Bakkani Narasimhulu) తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో దీనిపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్పందించారు. ఆయన వ్యక్తిగతంగా బక్కని నర్సింహులుకు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎంతో గొప్ప చరిత్ర , నేపథ్యం ఉన్న ప్రాంతాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు వారు ఎక్కడున్నా తెలుగు జాతి ఒక్కటేనని, ఎవరి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడకూడదని సూచించారు. తెలంగాణ గడ్డపైనే టీడీపీ పుట్టిందని గుర్తు చేశారు. తెలంగాణలో ఇప్పటికీ బలమైన క్యాడర్ ఉన్నారని చెప్పారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత తెలంగాణలో సామాజిక న్యాయం, అభివృద్ధికి బాటలు పడ్డాయని చెప్పారు. తెలంగాణలో సైతం మహానాడు ఉత్సాహంగా నిర్వహించడంపై పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు.
బక్కని నర్సింహులు ఏమన్నారంటే…
అమరావతిలో జరిగిన టీడీపీ మహానాడులో బక్కని నర్సింహులు మాట్లాడుతూ.. అసలు తెలంగాణ అనే పదమే డిక్షనరీలో లేదన్నారు. కొందరు వ్యక్తులు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి, కష్టపడి పని చేసే ప్రజల జీవితాలను నాశనం చేశారని ఆయన విమర్శించారు. తెలంగాణ అనే పదం గతంలో ఎక్కడా లేదని, అది ఒక సృష్టించబడిన పదం అన్న కోణంలో ఆయన మాట్లాడటం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది తెలంగాణ వాదుల నుంచి తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో చివరకు సీఎం చంద్రబాబు దీనిపై స్పందించి వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

