కలం, యాదగిరిగుట్ట: ప్రముఖ ఆధ్యాత్మిక పీఠమైన కంచి కామకోటి పీఠం పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి శుక్రవారం యాదగిరిగుట్ట (Yadagirigutta)కు విచ్చేసి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారి రాక సందర్భంగా దేవస్థాన అధికారులు, వేదపండితులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభ స్వాగతంతో స్వామిజీని ఆలయానికి తీసుకువెళ్లారు.
ప్రత్యేక దర్శన మార్గం ద్వారా గర్భాలయంలోకి చేరుకున్న శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామిజీకి వేదాశీర్వచనాలు అందజేసి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలతో సత్కరించారు. ఆలయ వైభవం, యాదగిరిగుట్ట క్షేత్ర అభివృద్ధిపై స్వామిజీ హర్షం వ్యక్తం చేసినట్లు దేవస్థాన వర్గాలు తెలిపాయి. స్వామిజీ దర్శనానికి సంబంధించిన సమాచారం తెలిసిన భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని ఆశీర్వాదాలు పొందారు. ఆలయ పరిసరాలు భక్తుల గోవింద నామస్మరణలతో మార్మోగాయి.

