కలం, నిజామాబాద్ బ్యూరో : ఎమ్మెల్సీ కవిత (Kalvakuntla Kavitha) ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆమె ప్రభావం ఆ జిల్లాపై ఎంత పడనుందనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. సోమవారం శాసనమండలి లో కవిత మాట్లాడుతూ, తన రాజీనామాను ఆమోదించాలని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి విన్నవించారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానని ఆ పార్టీ నుంచి సంక్రమించిన ఆ పదవిలో ఉండదల్చుకోలేదని ఆమె స్పష్టం చేశారు.
అయితే మరోసారి ఆలోచించుకోవాలని చైర్మన్ సూచించారు. కవిత రాజీనామా ఆమోదం అవుతుందా లేదా అనే విషయంపై కూడా సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. కవిత వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడనీ.. అందుకే రాజీనామా ఆమోదించరు అనే వాదనలు వినిపిస్తున్నాయి.
ముగ్గురు నలుగురు ఆశావహులు ఉన్నప్పటికీ అసలు కారణం మాత్రం వేరే కనిపిస్తోంది. కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీ కార్పొరేటర్లు కౌన్సిలర్లు జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎవరూ లేరు. వారి పదవీ కాలం ముగియడంతో ఇప్పటికిప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదు. మున్సిపల్ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితులు లేవు. 42 శాతం రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉంది.
రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉండటం వల్ల కూడా ఎన్నికల ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితులన్నీ బేరీజు వేస్తే కవిత రాజీనామా ఇప్పట్లో ఆమోదం పొందేలా కనిపించడం లేదు. అయితే తనది మండలిలో చివరి ప్రసంగం అని, బాధతో తిరిగి వెళ్తున్నానని.. మళ్ళీ చట్టసభలకు వస్తానని కవిత ప్రకటించారు. అలాగే, రాజకీయ పార్టీ పెడతానని కూడా చెబుతూ వస్తున్నారు. కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే స్పందిస్తున్నారు.
బీజేపీ నాయకులు వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారు. కవిత రాజకీయ పార్టీ పెడితే నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ బీజేపీల నుంచే అవకాశాలు రాని వారు ఆయా నియోజక వర్గాల్లో వివక్షకు గురవుతున్న నాయకులు కవిత బాటలో నడుస్తారనే టాక్ నడుస్తోంది. కేసీఆర్, పార్టీ నేతలపై నిజాం షుగర్స్ లాంటి అంశాలపై కవిత చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ పార్టీకి కొంత నష్టం వాటిల్లే అవకాశాలు జిల్లాలో కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ బీజేపీలు ఈ అంశాన్ని ప్రయోజనం పొందేలా మలచుకుంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also: ఈసారి విచారణకు నేనే వెళ్తా : మంత్రి ఉత్తమ్
Follow Us On: X(Twitter)


