కలం, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం నిర్మించనున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఈసారి జరిగే విచారణకు (Nallamala Sagar Hearing) మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్వయంగా హాజరుకానున్నారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ సాగునీటి హక్కులకు విఘాతం కలుగుతుందని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి తోడు ఏపీ ప్రభుత్వం అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టంతో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ (విభజన) చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తున్నదని పేర్కొన్నది.
ఈ అంశాలన్నింటినీ ప్రభుత్వం ఆ పిటిషన్‌లో పేర్కొన్నది. తదుపరి విచారణ (Nallamala Sagar Hearing) ఈ నెల 12న జరగనున్న నేపథ్యంలో స్వయంగా తానే హాజరు కానున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. మధ్యంతర స్టే ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టును కోరనున్నట్లు చెప్పారు. రెండు రోజుల క్రితం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మూడు, నాలుగు సూచనలు చేశారని గుర్తుచేశారు.
ఏకపక్షంగా ఏపీ ప్రాజెక్టుల నిర్మాణం :
ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా ప్రాజెక్టులను నిర్మించేందుకు దూకుడు ప్రదర్శిస్తున్నదని, పొరుగు రాష్ట్రాలతో వివాదాలు తలెత్తుతాయని తెలిసినా, లీగల్‌గా చెల్లుబాటు కాదని తెలిసినా నిర్ణయాలను తీసుకుంటున్నదని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. ఆ కారణంగానే తొలుత పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందని, తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో అప్పటికే అది పంపిన డీపీఆర్ (DPR)ను కేంద్ర జల సంఘం తిరిగి వెనక్కి పంపిందని గుర్తుచేశారు. ఆ తర్వాత పోలవరం-నల్లమల సాగర్ అనే కొత్త పేరుతో అదే ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నదన్నారు. జలశక్తి మంత్రిత్వశాఖకు, జల సంఘానికి ఫిర్యాదు చేశామని, సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశామన్నారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్నందున ఏపీ ఆలోచన కార్యరూపం దాల్చే అవకాశం లేదన్నారు. అందుకే స్టే విధించాల్సింగా కోరుతామని, విచారణకు ముందే సీనియర్ న్యాయవాదులతో మాట్లాడతామని ఉత్తమ్ వెల్లడించారు.
మూడు బ్యారేజీల రిపేర్లు ఫైనల్ కాలేదు :
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు చేయాల్సిన మరమ్మతులపై కార్యాచరణ కొనసాగుతున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. రిపేర్ వర్క్స్ కోసం టెండర్లను ఆహ్వానించామని, ఎన్డీఎస్ఏ (NDSA) సూచనల మేరకు డిజైన్ కన్సల్టెన్సీని ఇంకా ఖరారు చేయలేదని తెలిపారు. మూడు సంస్థలు వివిధ ఐఐటీల భాగస్వామ్యంతో ఆసక్తి చూపాయని, తుది నిర్ణయం తీసుకునేముందు ప్రభుత్వం లోతుగా స్టడీ చేస్తుందన్నారు. కచ్చితంగా నిబంధనల మేరకు నిర్ణయం ఉంటుందన్నారు. రిపేర్లు మళ్లీ మొదటికి రాకుండా, నాణ్యత ప్రకారమే జరిగేలా వర్క్ ఏజెన్సీలను ఫైనల్ చేసే ముందు ఆయా కంపెనీల మెరిట్స్ ను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. అన్నింటిపై స్పష్టత వచ్చిన వెంటనే ఫైనల్ అవుతుందని తెలిపారు . ఆ మేరకు సంబంధిత అధికారులకు సైతం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినట్లు మంత్రి ఉత్తమ్ వివరించారు.
Read Also: రేవంత్ రెడ్డికి మూటలు మోసుడు తప్ప ఏం తెల్వదు : కేటీఆర్
Follow Us On : WhatsApp


