కలం, ఖమ్మం బ్యూరో: బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు తెలంగాణ ప్రజలతో పాటు ఇక్కడి ఆదివాసీల హక్కు అని టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని బయ్యారం ఇనుపరాతి గుట్టలను కవిత సందర్శించి, ఖనిజ నిల్వలను పరిశీలించారు.
తక్షణమే వినియోగించాలి..
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన చట్టంలో బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలనే స్పష్టమైన ప్రతిపాదన ఉన్నా.. రకరకాల కారణాలతో ఏ ప్రభుత్వం కూడా ఈ ప్రాంత వాసుల దశాబ్దాల కలను నెరవేర్చలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక్కడి యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభించాలన్నా, ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలన్నా బయ్యారం ఇనుప ఖనిజాన్ని తక్షణమే పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని కవిత పేర్కొన్నారు.
సింగరేణి కూడా బలోపేతం..
బయ్యారం విషయంలో తెలంగాణ రక్షణ సేన మొదటి నుంచి ఒకే మాటపై ఉందని కవిత స్పష్టం చేశారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి ఉత్పత్తి ప్రారంభిస్తే స్థానిక ప్రజలకు ఉద్యోగాలతో పాటు సింగరేణి సంస్థ కూడా మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు.
పరిశ్రమ మనుగడకు, స్థానిక ఖనిజ వినియోగానికి అవసరమైతే పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న ఐరన్ ఫ్యాక్టరీలతో అనుసంధానం చేయాలని కవిత సూచించారు. ఈ ప్రాంత ప్రజలకు కచ్చితంగా మేలు జరిగేలా, బయ్యారం ఉక్కు కల సాకారమయ్యేలా తమ వంతుగా గట్టి ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.

