Mobile Popup Ad
Mobile Popup Ad

వాటర్ బార్ కల్చర్.. లీటర్ నీళ్లకు వేల రూపాయలు!

కలం, న్యూఢిల్లీ: ఇండియాలో పెండ్లిళ్లు, పెద్ద పెద్ద ఫంక్షన్లు అంటేనే అట్టహాసాలు.. అంతులేని ఆడంబరాలు.. సరికొత్త ట్రెండ్‌లకు కేరాఫ్ అడ్రస్. వేడుక ఏదైనా సరే.. ఫుడ్ మెనూ, డెకరేషన్, బట్టల విషయంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ కొత్త ప్రయోగాలు చేసే భారతీయ సంపన్న వర్గం.. ఇప్పుడు ఆతిథ్య మర్యాదల్లో ఒక ఊహించని సరికొత్త లగ్జరీ ట్రెండ్‌ను తెరపైకి తెచ్చింది. అదే ‘వాటర్ బార్’ (Luxury Water Bar Trend) సంస్కృతి. సాధారణంగా పెండ్లి లేదా ఫంక్షన్లలో కాక్టెయిల్స్, ఖరీదైన మద్యం లేదా మోక్‌టెయిల్స్ కోసం ప్రత్యేక బార్ కౌంటర్లు ఉండటం మనకు తెలుసు. కానీ.. ఇప్పుడు దేశంలోని అత్యంత విలాసవంతమైన, కోటీశ్వరుల పెళ్లిళ్లు, ఫంక్షన్స్ లో కేవలం మంచినీళ్ల కోసమే ప్రత్యేకమైన బార్‌ ఏర్పాటు చేస్తున్నారు.

ఇక్కడ లీటర్ నీళ్లు వందల నుంచి వేల రూపాయల విలువ చేసే ప్రపంచవ్యాప్తంగా లభించే అత్యంత అరుదైన ప్రీమియం బ్రాండ్ల నేచురల్ మినరల్ వాటర్.. గ్లేసియర్ వాటర్ (మంచు పర్వతాల నీరు).. స్ప్రింగ్ వాటర్ (సహజ బుగ్గల నీరు) వంటి రకాలను అతిథులకు అందిస్తున్నారు. వైన్ టేస్టింగ్ లాగే ఇప్పుడు వాటర్ టేస్టింగ్ కూడా ఒక విలాసంగా మారింది. శుభకార్యానికి వచ్చే ప్రతి ఒక్కరూ ఆల్కహాల్ తీసుకోరు. అలాంటి అతిథులకు విలాసవంతమైన అనుభూతి ఇచ్చేందుకు వాటర్ బార్ ఏర్పాటు చేస్తున్నారు. ఆర్డినరీ వాటర్ (ఆర్వో ప్రాసెస్ చేసిన నీరు)లో మినరల్స్ ఉండవు. కానీ నేచురల్ మినరల్ వాటర్‌లో సహజమైన కాల్షియం, మెగ్నీషియం అలాగే ఉంటాయి. ల్యాబ్‌లో తయారుచేసిన డైమండ్‌కు, నిజమైన డైమండ్‌కు ఉన్నంత తేడా వీటికి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

నీరు ఎంతో ప్రాచీనమైంది..

పెండ్లిళ్లు, ఫంక్షన్స్ లో ఆహారం.. డెకరేషన్.. బట్టలు ఇలా అన్నింటికీ ప్రాధాన్యత ఇస్తారు. నీటిని మాత్రం సాధారణంగా చూస్తారు. అయితే.. అతిథులకు ఇచ్చే గౌరవంలో నీరు అత్యంత ప్రాచీనమైనది. 2025లో ఫుడ్‌స్టోరీస్ స్టోర్లలో ప్రీమియం వాటర్ బాటిళ్ల విక్రయాలు 3 రెట్లు పెరిగాయి. లగ్జరీ డెస్టినేషన్ పెళ్లిళ్లలో వాటర్ బార్లను డిజైన్ చేయడానికి స్పెషల్గా ఆర్డర్లు ఇస్తున్నారు.

వాటర్ బిజినెస్ లో సెలబ్రిటీలు..

లగ్జరీ వాటర్ బాటిల్స్ మార్కెట్ పెరగడానికి బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా కారణం. నటి భూమి పెడ్నేకర్ సోదరి సమీక్షతో కలిసి హిమాలయాల నుంచి సేకరించే నేచురల్ మినరల్ వాటర్ బ్రాండ్ బ్యాక్‌బే ను ప్రారంభించారు. హాలీవుడ్ నటుడు జేసన్ మోమోవా (ఆక్వామ్యాన్ ఫేమ్) కూడా పర్యావరణ అనుకూల వాటర్ బ్రాండ్ మననలును ప్రమోట్ చేస్తున్నారు.మెషీన్ల ద్వారా శుద్ధి చేసిన ఆర్వో నీటి కంటే.. భూగర్భం నుంచి నేరుగా లభించే సహజ ఖనిజ లవణాలు కలిగిన నీటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. నీటిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు శరీరాన్ని రీహైడ్రేట్ చేయడంలో తోడ్పడతాయి. రాత్రంతా పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేసే వారికి ఇది నేచురల్ ఎలక్ట్రోలైట్‌లా పనిచేస్తుంది.

విరాట్ తాగేవి ఎవియాన్ బ్రాండ్..

విరాట్ కోహ్లీ తాగే ఎవియాన్ బ్రాండ్లతో ప్రీమియం నీటిపై క్రేజ్ పెరిగింది. లీటర్ నీరు వెయ్యి రూపాయల దాకా ఉంటుంది. న్యూయార్క్ నుంచి దిగుమతి చేసుకున్న‘సరాటోగా స్ప్రింగ్ వాటర్’ బ్రాండ్లు 355 మిల్లీ లీటర్ల బాటిల్ రూ.799 ఉన్నప్పటికీ.. మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. కంటెంట్ క్రియేటర్ సాక్షి శివదాసాని.. ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ఒక పెళ్లికి వెళ్లినప్పుడు ‘వాటర్ బార్’ చూశానని చెప్పారు. అక్కడ సాధారణ లైమ్ సోడా లేదా బ్లూ లాగూన్ (మోక్‌టెయిల్స్) కాకుండా.. గ్లేసియర్ వాటర్, స్ప్రింగ్ వాటర్, మినరల్ వాటర్ సర్వ్ చేశారు. పెళ్లికొడుకు స్నేహితులంతా డ్రై ఏప్రిల్ (ఏప్రిల్ నెల మొత్తం ఆల్కహాల్‌కు దూరంగా ఉండే ఛాలెంజ్) పాటిస్తున్నారు. వారికి ఈ వాటర్ బార్ ఎంతో అనుభూతి ఇచ్చిందని సాక్షి శివదాసాని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>