కలం, వాషింగ్టన్: లీగల్ ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ లో అగ్రరాజ్యం అమెరికా అత్యంత కీలకమైన, సమూలమైన మార్పులకు (US Immigration Changes) శ్రీకారం చుట్టబోతున్నది. ఇప్పటికే అనేక ఆంక్షలు విధించిన ట్రంప్‌సర్కారు.. ఇప్పుడు మరిన్ని కొత్త రూల్స్‌తీసుకురావడానికి సిద్ధమైంది. హెచ్-1బీ, గ్రీన్ కార్డ్, అంతర్జాతీయ విద్యార్థుల వీసాలతో పాటు వర్క్ పర్మిట్ నియమాలను (US Visa Rule) కఠినతనం చేస్తూ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ, కార్మిక శాఖ కలిసి తాజాగా కొత్త రెగ్యులేటరీ అజెండాను సిద్ధం చేసింది.
అమెరికా వీసా వ్యవస్థలో భారతీయ వృత్తి నిపుణులు, విద్యార్థుల పాత్రే అత్యధికంగా ఉండటంతో.. ఈ ప్రతిపాదిత కొత్త నిబంధనల వల్ల ఇండియన్స్ పై అత్యంత తీవ్ర ప్రభావం పడనుంది. ఈ మార్పుల్లో కొన్నింటిని ఈ నెలలోనే (జులై) తుది నిబంధనల కింద అమల్లోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తుండగా, మిగిలిన వాటిని ప్రతిపాదనల కింద ప్రకటించి ప్రజాభిప్రాయాన్ని సేకరించనున్నారు.
హెచ్-1బీ వీసా నిబంధనలు కఠినతరం
అమెరికా ఐటీ రంగంలో పనిచేసే విదేశీ నిపుణుల కోసం ఉద్దేశించిన హెచ్-1బీ వీసా విధానంలో ప్రభుత్వం మరింత కఠినమైన నిబంధనలు తీసుకురావాలని చూస్తున్నది. ముఖ్యంగా కన్సల్టింగ్ సంస్థల ద్వారా అమెరికా కంపెనీల క్లయింట్ సైట్లలో పనిచేసే ఉద్యోగుల విషయంలో అదనపు పర్యవేక్షణ పెంచనున్నారు. కొత్త నిబంధనల ప్రకారం.. ఒక ఉద్యోగిని క్లయింట్ కార్యాలయంలో నియమించినప్పుడు ఆ ఉద్యోగి నిజంగా వీసా స్పాన్సర్ చేసిన కంపెనీకే పనిచేస్తున్నాడని నిరూపించాల్సి ఉంటుంది. అలాగే ఉద్యోగి ఏ ప్రదేశంలో, ఏ ప్రాజెక్టులో పనిచేస్తున్నాడనే వివరాలను కంపెనీలు క్రమం తప్పకుండా ప్రభుత్వానికి అందించాల్సి రావచ్చు. కొన్ని సందర్భాల్లో హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసే ఉద్యోగులతో పాటు, వీసాను స్పాన్సర్ చేసే కంపెనీ ప్రతినిధుల నుంచి కూడా బయోమెట్రిక్ సమాచారం తీసుకునే అవకాశం రావొచ్చు.
కంపెనీలపై అదనపు ఖర్చు కూడా పెరగనుంది. ప్రస్తుతం 50 మందికి పైగా ఉద్యోగులు ఉన్న కొన్ని కంపెనీలు కొత్త హెచ్-1బీ పిటిషన్లకు 4,000 డాలర్లు, ఎల్-1 పిటిషన్లకు 4,500 డాలర్ల అదనపు ఫీజు చెల్లిస్తున్నాయి. ప్రతిపాదిత మార్పుల ప్రకారం, వీసా పొడిగింపు (ఎక్స్‌టెన్షన్) దరఖాస్తులకు కూడా ఈ అదనపు ఫీజులు వర్తించే అవకాశం ఉంది. మరో కీలక మార్పు కనీస వేతన నిబంధనలకు సంబంధించినది.
హెచ్-1బీ ఉద్యోగాల కోసం నిర్ణయించే కనీస వేతన స్థాయిని ప్రస్తుత 17వ పర్సంటైల్ నుంచి 34వ పర్సంటైల్ కు పెంచే ప్రతిపాదన ఉంది. అంటే విదేశీ ఉద్యోగులను నియమించుకునే అమెరికా కంపెనీలు వారికి ఎక్కువ జీతాలు చెల్లించాల్సి రావచ్చు. ఈ మార్పుల వల్ల అమెరికాలో తక్కువ స్థాయి లేదా ప్రారంభ స్థాయి ఉద్యోగాలకు విదేశీ నిపుణులను నియమించడం కంపెనీలకు ఖరీదైనదిగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉపయోగించే కన్సల్టింగ్ విధానంపై ప్రభావం పడవచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో భారతీయ ఐటీ నిపుణులకు అమెరికాలో కొత్త ఉద్యోగ అవకాశాలు తగ్గే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
విద్యార్థుల వీసాలపై ఆంక్షలు!
విదేశీ విద్యార్థుల వీసా విధానాల్లో కూడా కీలక మార్పులు తీసుకురావాలని అగ్రరాజ్యం భావిస్తున్నది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న మొత్తం విదేశీ విద్యార్థుల్లో భారతీయుల సంఖ్య అత్యధికంగా ఉంది. దాదాపు 3.6 లక్షల మంది భారతీయ విద్యార్థులు (మొత్తం విదేశీ విద్యార్థుల్లో సుమారు 31 శాతం) అమెరికాలో చదువుతున్నారు. ప్రస్తుతం ఉన్న “డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్” విధానం ప్రకారం.. విద్యార్థులు తమ కోర్సు లేదా అనుమతించిన శిక్షణ కార్యక్రమం పూర్తయ్యే వరకు అమెరికాలో ఉండే అవకాశం ఉంటుంది. అయితే, ఇకపై విద్యార్థులకు, జే-1 వీసాపై వచ్చే ఎక్స్ఛేంజ్ విజిటర్లకు ఒక నిర్దిష్ట కాలపరిమితితో కూడిన వీసా విధానాన్ని తీసుకురావాలని ప్రతిపాదిస్తున్నారు.
ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే.. విద్యార్థులకు ఇచ్చే నివాస అనుమతికి ఒక గడువు ఉంటుంది. ఆ గడువులోగా చదువు లేదా పరిశోధన పూర్తికాకపోతే, వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన ఫీజులు చెల్లించి అనుమతిని పొడిగించుకోవాలి. అలాగే, చదువు పూర్తయ్యాక విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉద్యోగ అనుభవం పొందేందుకు ఉపయోగించే ఓపిటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్), సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ రంగాల వారికి లభించే స్టెమ్ ఓపిటీ ఎక్స్ టెన్షన్, అలాగే చదువుతో పాటు పని చేసే అవకాశం కల్పించే సీపీటీ (కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్) కార్యక్రమాలను కూడా సమీక్షించనున్నారు. ఈ మార్పులు అమల్లోకి వస్తే, అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు అదనపు నిబంధనలు, ఖర్చులు, ప్రక్రియలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా చదువు పూర్తయిన తర్వాత అక్కడే ఉద్యోగాలు పొందాలని భావించే విద్యార్థులపై ఈ మార్పుల ప్రభావం ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
గ్రీన్ కార్డ్, వర్క్ పర్మిట్లో కీలక మార్పులు!
గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న భారతీయ దరఖాస్తుదారులకు కూడా కొత్త నిబంధనలు మరిన్ని ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంది. తాజా వీసా బులెటిన్ ప్రకారం.. భారతీయులకు అత్యంత ముఖ్యమైన ఈబీ-2 కేటగిరీ గ్రీన్ కార్డుల జారీని ఈ ఆర్థిక సంవత్సరానికి పూర్తిగా నిలిపివేశారు (అన్అవైలబుల్). ప్రస్తుతం అమెరికాలో ఉంటూనే గ్రీన్ కార్డ్ ప్రక్రియను పూర్తి చేసుకునే ‘ఎడ్జెస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్’ విధానాన్ని పరిమితం చేసి, దరఖాస్తుదారులు తమ స్వదేశాలకు వెళ్లి ‘కన్సులర్ ప్రాసెసింగ్’ ద్వారా వీసా ప్రక్రియను పూర్తి చేసుకోవాలని వలసల విభాగం యూఎస్సీఐఎస్ సూచిస్తున్నది.
దీనికి తోడు, హెచ్-1బీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు లభించే హెచ్-4 వీసా వర్క్ పర్మిట్ అయిన ఈఏడీ ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ విధానంలో కూడా మార్పులు తీసుకురావాలని భావిస్తున్నారు. ప్రత్యేకంగా హెచ్-1బీ వీసాలపై అమెరికాలో ఉన్న భారతీయ ఉద్యోగుల జీవిత భాగస్వాముల్లో లక్షకు పైగా మందికి ఈ వర్క్ పర్మిట్ ఉపయోగపడుతున్నది. కొత్త విధానం అమల్లోకి వస్తే, పాత వర్క్ పర్మిట్ గడువు ముగిసిన తర్వాత కొత్త కార్డు చేతికి వచ్చే వరకు వారు ఉద్యోగాలను తాత్కాలికంగా ఆపి వేయాల్సి రావొచ్చు. గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న భారతీయులు మాత్రమే కాకుండా, అమెరికాలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్న అనేక మంది విదేశీ నిపుణులు, వారి కుటుంబాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.
ఫీజుల పెంపు, పౌరసత్వ పరీక్షల్లో మార్పులు
వలస నిబంధనల మార్పులతో పాటు, ఈ ఏడాది చివరిలో వివిధ రకాల వీసాల బేస్ లైన్ అప్లికేషన్ ఫీజులను, అలాగే ఈబీ-5 ఇన్వెస్టర్ వీసా ఫీజులను కూడా పెంచాలని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం యోచిస్తున్నది. అంతేకాకుండా, అమెరికా పౌరసత్వం పొందేందుకు రాసే పరీక్షల విధానాన్ని కూడా మార్చనున్నారు. కేవలం ప్రభుత్వమే కాకుండా, థర్డ్-పార్టీ సంస్థల ద్వారా ఈ పరీక్షలు నిర్వహించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
అమెరికాకు ఇబ్బందుల్లేవా..?
వలస విధానంలో ఈ కఠిన పరిశీలనలు, వీసా ప్రాసెసింగ్ ఆలస్యాల కారణంగా అమెరికా కంపెనీలు కూడా విదేశీ వృత్తి నిపుణులను వేగంగా నియమించుకోలేక ఇబ్బందులు పడుతున్నాయి. ఒక సర్వే ప్రకారం.. గడిచిన ఏడాది కాలంలో అగ్రరాజ్యంలోని దాదాపు 65 శాతం కంపెనీలు కనీసం ఒక విదేశీ ఉద్యోగినైనా కోల్పోవాల్సి వచ్చింది. ఈ ప్రతిపాదిత కొత్త నిబంధనలు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే అటు భారతీయ కుటుంబాలపై, ఇటు అమెరికా ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

