కలం, మహబూబ్ నగర్ బ్యూరో: గ్రామాలు సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని జిల్లా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలని, గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఒక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు పోవాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
నూతన సర్పంచులకు అభినందనలు..
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులకు అభినందనలు తెలియజేసిన కలెక్టర్.. ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అని అన్నారు. గ్రామానికి సంబంధించిన ప్రతి సంక్షేమ పథకం, అభివృద్ధి కార్యక్రమం, నిధులు, పనుల పురోగతి, ప్రభుత్వ మార్గదర్శకాలపై సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు.
వారం రోజుల్లోగా సమర్పించాలి..
ప్రజలు అడిగే ప్రతి ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్పగలిగే స్థాయిలో సర్పంచులు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. గ్రామపంచాయతీల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మంజూరైన పనులు, అందిన నిధులు, పూర్తయిన పనులు, పెండింగ్ పనులు, చెల్లింపుల వివరాలు వంటి సమగ్ర సమాచారాన్ని ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. ఇందుకోసం రూపొందించిన ప్రొఫార్మాలను పంచాయతీ కార్యదర్శులు పూర్తి చేసి వారం రోజుల్లోగా సమర్పించాలని ఆదేశించారు. అనంతరం ఈ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేయబడతాయని, భవిష్యత్తులో గ్రామాల అభివృద్ధి పురోగతిని సులభంగా సమీక్షించే అవకాశం ఉంటుందని తెలిపారు.
కొత్తగా వచ్చిన వీబీజీ రామ్ – జీ చట్టంపై, కొత్త విధానాలు, పనుల ఎంపిక, వేతనాల చెల్లింపులు, పరిహారం, ఇతర నిబంధనలపై శిక్షణలో సమగ్రంగా వివరిస్తున్నందున ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామసభలు, వార్డు సభల ద్వారా ప్రజలకు వివరించి సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు.
పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం..
గ్రామాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ అన్నారు. వర్షాకాలంలో చెత్త నిర్వహణ సక్రమంగా లేకపోతే డెంగ్యూ, డయేరియా, వైరల్ జ్వరాలు వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రతి గ్రామంలో ఘన వ్యర్థాల నిర్వహణ, చెత్త వేరు చేయడం, డ్రైనేజీల పరిశుభ్రత, తాగునీటి వనరుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలి..
అలాగే అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రీ-ప్రైమరీ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, వ్యవసాయ సేవలు తదితర అంశాలపై సర్పంచులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. చిన్నారుల విద్య, పోషకాహారం, గ్రామ ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబరిస్తే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
పంచాయతీ కార్యదర్శులు ప్రజాప్రతినిధులతో సమన్వయంగా పనిచేసి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా పనిచేయాలని చెప్పారు.

