Mobile Popup Ad
Mobile Popup Ad

టీమిండియాకు ఏమైంది..? గెలుపు బాట ఎటువైపు?

కలం, స్పోర్ట్స్ బ్యూరో : ఒకప్పుడు ప్రత్యర్థులను భయపెట్టిన టీమిండియా.. ఇప్పుడు వరుస ఓటములతో విమర్శలు (Team India Crisis) మూటగట్టుకుంటున్నది. ప్రతి మ్యాచ్ తర్వాత కారణాలు వెతుకుంటున్నది.. కానీ, ఫలితం మాత్రం మారట్లేదు.. అసలు తప్పు ఎక్కడ జరుగుతున్నది..? ఆటగాళ్లలోనా..? కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాల్లోనా..? మేనేజ్‌మెంట్ నిర్ణయాల్లోనా..? లేక జట్టు నిర్మాణంలోనే లోపమా..?

కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జట్టులో మార్పులు వేగంగా జరుగుతున్నాయి. ప్లేయింగ్ ఎలెవన్లో మార్పులు.. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు.. కొత్త కాంబినేషన్లు.. ఇవన్నీ స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక ఆటగాడికి ఒక పాత్ర ఇవ్వకుండా.. తరచూ బాధ్యతలు మార్చడం సరైన విధానమేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫామ్లో ఉన్న ఆటగాళ్లను పక్కన పెట్టడం, అనుభవజ్ఞులకు విశ్రాంతి ఇవ్వడం, కొత్తవారికి వరుస అవకాశాలు కల్పించడం.. ఇవన్నీ భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయాలే కావొచ్చు. కానీ, ఇవే ప్రస్తుత ఫలితాలపై ప్రభావం చూపుతున్నాయనే అభిప్రాయం క్రికెట్ ప్రపంచంలో వ్యక్తమవుతున్నది.

ఐపీఎల్.. అంతర్జాతీయ క్రికెట్ ఒకటి కాదు

ఐపీఎల్లో రెండు మూడు మంచి ఇన్నింగ్స్ ఆడితే స్టార్‌గా మారొచ్చు. కానీ, అంతర్జాతీయ క్రికెట్లో ప్రతి మ్యాచ్ ఒత్తిడితో నిండి ఉంటుంది. అక్కడ ప్రతి తప్పు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఈ మార్పుకు యువ ఆటగాళ్లు పూర్తిగా అలవాటు పడలేకపోతున్నారనే చర్చ జరుగుతున్నది. ఐపీఎల్లో స్వేచ్ఛగా ఆడే యువ ఆటగాళ్లు.. టీమిండియా జెర్సీ వేసుకున్నాక తడబడుతున్నారు. ప్రతి మ్యాచ్ తమ కెరీర్‌ను నిర్ణయిస్తుందనే ఒత్తిడి వారిపై స్పష్టంగా కనిపిస్తున్నది. ఒక్క మ్యాచ్ విఫలమైతే జట్టులో చోటు పోతుందనే భయం వారిని వెంటాడుతున్నది. అదే వారిలో దూకుడును తగ్గించి, సహజ ఆటను మరిచి, వికెట్ కాపాడుకోవడానికే పరిమితం చేస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

సీనియర్ల లోటు కనిపిస్తున్నదా..?

ఒత్తిడి సమయంలో ఇన్నింగ్స్‌ను నిలబెట్టే బ్యాటర్.. మ్యాచ్‌ను మలుపు తిప్పే అనుభవజ్ఞుడు.. జట్టును ముందుండి నడిపించే నాయకత్వం.. ఇవన్నీ ప్రస్తుతం తక్కువగా కనిపిస్తున్నాయని మాజీ క్రికెటర్లు విశ్లేషిస్తున్నారు. కష్ట సమయంలో బాధ్యత తీసుకునే ఆటగాళ్ల సంఖ్య తగ్గిందనే అభిప్రాయం ఉంది. టాప్ ఆర్డర్ నిలబడటం లేదు. మిడిల్ ఆర్డర్ మ్యాచ్ ముగించడం లేదు. డెత్ ఓవర్లలో బౌలర్లు పరుగులు ఆపలేకపోతున్నారు. ఫీల్డింగ్ లో క్యాచ్‌లు జారిపోతున్నాయి. ఒక్క విభాగం కాదు.. అన్ని విభాగాల్లోనూ తప్పులు కనిపిస్తున్నాయి.

ఆ కోర్ టీమ్ ఏది..?

జట్టును భవిష్యత్తు కోసం సిద్ధం చేస్తున్నారా..? లేక ప్రతి సిరీస్‌ను ప్రయోగశాలగా మార్చారా..? వరల్డ్ కప్ లక్ష్యంగా కోర్ టీమ్ ఏది..? ఎవరిపై నమ్మకం ఉంది..? అనే ప్రశ్నలకు ఇంకా స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు. అలాగే టీమిండియా ఓటములకు ఒక్క కారణాన్ని మాత్రమే చూపించడం కష్టం. యువ ఆటగాళ్ల అనుభవలేమి, మేనేజ్‌మెంట్ నిర్ణయాలు, కోచ్ వ్యూహాలు, జట్టులో స్థిరత్వం లేకపోవడం, ఒత్తిడిని తట్టుకోలేకపోవడం.. ఇవన్నీ కలిసి టీమిండియా ప్రదర్శనను దెబ్బతీస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. వరుస ఓటములు ఇప్పుడు కేవలం ఫలితాల సమస్య మాత్రమే కాదని.. భారత జట్టు భవిష్యత్తు దిశపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>