కలం, సంగారెడ్డి: డ్యామ్ సేఫ్టీ అధికారుల హెచ్చరికలతో సింగూరు ప్రాజెక్టు (Singur Dam) కు అత్యవసర మరమ్మతులు ప్రారంభించినప్పటికీ, పనులు ఆశించిన వేగంతో సాగకపోవడంతో ఉమ్మడి మెదక్ జిల్లా రైతుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో మరమ్మతులు జాప్యం అవుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే యాసంగి సీజన్‌లో క్రాప్ హాలీడేతో నష్టపోయిన రైతులు, ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సమీపంలోని మంజీరా నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టు 1988లో వినియోగంలోకి వచ్చింది. 29.917 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాలకు తాగునీటిని అందించడమే కాకుండా, సింగూరు ఆయకట్టు కింద సుమారు 40 వేల ఎకరాలు, ఘనపురం ఆనకట్ట కింద మరో 20 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తోంది. నిజాంసాగర్‌కు కూడా ఇక్కడి నుంచి నీటి కేటాయింపులు ఉన్నాయి.
నిర్వహణ లోపంతో ఆందోళన
ప్రాజెక్టు నిర్మాణం తర్వాత దాదాపు రెండు దశాబ్దాల పాటు కట్ట, రివిట్‌మెంట్ బాగానే ఉన్నప్పటికీ, 2012 తర్వాత సరైన నిర్వహణ లేకపోవడంతో రివిట్‌మెంట్ దెబ్బతినడం ప్రారంభమైంది. రాళ్లు ఊడిపోవడం, కట్ట కుంగిపోవడం వంటి సమస్యలు కనిపించినా అప్పట్లో మరమ్మతులు చేపట్టలేదని అధికారులు, నిపుణులు చెబుతున్నారు.
2015-16, 2018-19లో ప్రాజెక్టు దాదాపు ఖాళీగా ఉన్న సమయంలో కూడా మరమ్మతులు చేపట్టే అవకాశాన్ని వినియోగించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. గతేడాది డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ నిర్వహించిన తనిఖీలో కట్ట భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కట్టకు రక్షణగా ఉన్న పిట్టగోడలో చీలికలు, రివిట్‌మెంట్ దెబ్బతినడం, స్పిల్‌వే, ఎర్త్‌డ్యామ్, గ్యాలరీలకు అత్యవసర మరమ్మతులు అవసరమని సూచించింది.
నత్తనడకన పనులు
అత్యంత దెబ్బతిన్న ప్రాంతాల్లో ముందుగా మరమ్మతులు చేపట్టాల్సిన బదులు, డ్యామ్ మరో చివర నుంచి పనులు ప్రారంభించడం వల్ల నీటి నిల్వకు అవకాశం లేకుండా పోయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పనుల వేగం కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ వర్షాకాలంలో మరమ్మతులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగానే కాంట్రాక్టర్ పనులను నెమ్మదిగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
మరో క్రాప్ హాలీడే భయం
ఆగస్టు నుంచి ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, మరమ్మతులు పూర్తికాకపోతే ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడం కష్టమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితి కొనసాగితే ఖరీఫ్‌తో పాటు వచ్చే రబీ సీజన్‌లో కూడా క్రాప్ హాలీడే ప్రకటించే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగునీటితో పాటు హైదరాబాద్ నగరం, మిషన్ భగీరథ తాగునీటి సరఫరాపైనా ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి
క్రాప్ హాలీడే కారణంగా వరుసగా మూడు సీజన్లుగా సాగుకు దూరమవుతున్నామని, కుటుంబాల పోషణ భారంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేసి, ప్రాజెక్టులో నీటి నిల్వకు చర్యలు తీసుకోవాలని, అలాగే క్రాప్ హాలీడేతో నష్టపోయిన రైతులకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రాజెక్టు మరమ్మతులు.. నీళ్లు ఖాళీ
డ్యామ్ సేఫ్టీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం రూ.16 కోట్లతో మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించింది. అప్పట్లో ప్రాజెక్టులో 15 టీఎంసీల నీరు ఉండగా, పనుల కోసం డిసెంబర్‌లో పూర్తిగా ఖాళీ చేశారు. దీంతో సింగూరు కింద 40 వేల ఎకరాలు, ఘనపురం కింద మరో 20 వేల ఎకరాలకు యాసంగి సీజన్‌లో క్రాప్ హాలీడే ప్రకటించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో తాగునీటి అవసరాల కోసం కేవలం 4.5 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది.

