Mobile Popup Ad
Mobile Popup Ad

యువజన హక్కుల కోసం పోరాటాలకు సిద్ధం కావాలి: పంజాల శ్రీనివాస్

కలం, కరీంనగర్ బ్యూరో: అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) కరీంనగర్ నగర 14 వ మహాసభ నగర అధ్యక్షులు చెంచల మురళి అధ్యక్షతన బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో జరిగింది. మహాసభల సందర్భంగా ఏర్పాటుచేసిన ఏఐవైఎఫ్ (Karimnagar AIYF) పతాకాన్ని రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్లపల్లి యుగంధర్ ఎగరవేశారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. దేశంలో యువజనులు ఎదుర్కొంటున్న సమస్యల పైన పోరాడేందుకు, హక్కులను సాధించుకునేందుకు యువతి, యువకులను ఐక్యపరిచి 1953 మే 3వ తేదీన ఏఐవైఎఫ్ ఆవిర్భవించబడిందని చెప్పారు. నాటి నుండి నేటి వరకు యువజన హక్కుల సాధనే ద్యేయంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు.యువజన హక్కుల కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు..

18 సంవత్సరాల నిండిన యువతకు ఓటు హక్కు కల్పించాలని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్రలు చేసి ఓటు హక్కు కల్పించిన ఘనత ఒక ఏఐవైఎఫ్ కే దక్కిందని శ్రీనివాస్ అన్నారు. దేశ భవిష్యత్తు యువత పైనే ఆధారపడి ఉందని చెప్పారు. ఈ దేశంలో కోట్లాదిమంది యువత విద్య, ఉపాధి అవకాశాలు లేక ఉన్నత చదువులు చదివి అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆయన విమర్శించారు.

బీజేపీపై ఫైర్..

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తామని గత 12 సంవత్సరాల క్రితం చెప్పిందని కానీ, నేటికీ 12 సంవత్సరాలు అయినా కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామన్నారని గుర్తు చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రతి ఏటా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసం చేసిందని.. ఉద్యోగాల కల్పనలో కాంగ్రెస్ కూడా పూర్తిగా మాట తప్పిందని మండిపడ్డారు. వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాలని పంజాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

ఈనెల 13న జిల్లా మహాసభలు..

ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి భావండ్ల పెళ్లి యుగంధర్ మాట్లాడుతూ.. యువతకు ఎన్నికల సమయంలో యువతకు హామీలు ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతుందని నిరుద్యోగానికి అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఈనెల 13న ఏఐవైఎఫ్ కరీంనగర్ జిల్లా మహాసభలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. నగరం నుండి యువత పెద్ద ఎత్తున తరలివచ్చి జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని నగర కార్యకర్తలకు యుగంధర్ పిలుపునిచ్చారు.

ఈ మహాసభలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు ఎన్ఎఫ్ఐడబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు బీర్ల పద్మ, ఏఐవైఎఫ్ నాయకులు కసిబోజుల సంతోషి చారి, కాల్వ శ్రీనివాస్ యాదవ్,మేకల రమ, సంపత్ నాయక్, జువ్వాడి తిరుపతి, హేమంత్,శ్రావణ్,బిర్లా స్వాతి, ఉదయ భాస్కర్,అరవింద్ పూజ, వినయ్,నునావత్ శ్రీనివాస్,జహంగీర్, అంజయ్య, బోయిని విష్ణు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>