కలం, వెబ్ డెస్క్ : రాజ్యసభలో ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ద బిల్లు సందర్భంగా బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నడుమ మాటల యుద్ధం నెలకొంది. అమరావతి బిల్లుపై చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి (Suresh Reddy) మాట్లాడుతూ.. కేంద్ర సాయం లేకుండానే కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టును కేసీఆర్ కంప్లీట్ చేశారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా పార్లమెంటుకు వచ్చిన విభజన బిల్లుపై బీజేపీ తరచూ నెగెటివ్ కామెంట్లు చేస్తుందని ఆరోపించారు. తల్లిని చంపి బిడ్డను వేరుచేశారని పదేపదే ఆరోపిస్తున్నది.. దీనిపై స్పష్టమైన వైఖరిని బీజేపీ ఇప్పటికైనా వెల్లడించాలని కోరారు.
కేసీఆర్ అనాడే చెప్పారు..
రాష్ట్రాలు వేరైనా తెలుగు సోదరులుగా కలిసే ఉందామని కేసీఆర్ ఆనాడే చెప్పారని సురేష్ రెడ్డి అన్నారు. అమరావతిని రాజధానిగా చేసుకోడానికి కేసీఆర్ మద్దతు తెలిపారని… స్వయంగా ఆయన కూడా వెళ్ళి చంద్రబాబును కలిసి వచ్చారని, అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా మంచి పరిపాలన అందించారని కొనియాడారు. అన్ని రంగాల్లో తెలంగాణనను దేశంలోనే నంబర్ వన్ స్టేట్‌గా మార్చారని చెప్పుకొచ్చారు. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసేటప్పుడు సభలో కనీసం చర్చ కూడా పెట్టలేదని అసహనం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును (Kaleshwaram Project) యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి సాగు విస్తీర్ణాన్ని కేసీఆర్ పెంచారని చెప్పారు. మేడిగడ్డ రెండు పిల్లర్లు కూలిపోతే మొత్తం బ్యారేజీ వేస్ట్ అయినట్లుగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
సురేశ్ రెడ్డికి కిషన్ రెడ్డి కౌంటర్
కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి (Kishan Reddy) కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఉపయోగం లేదని కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెప్పాయి.. రిపోర్టులు కూడా ఇచ్చాయని వెల్లడించారు. మేడిగడ్డ తో పాటు మిగిలిన రెండు బ్యారేజీల్లో లోపాలను సాగునీటి నిపుణులు, ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి తేల్చారని వివరించారు. నిపుణులతో పాటు కాగ్ సైతం తన నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టులోని అవకతవకలు, ఆర్థిక నిర్వహణలోని లోపాలను ఎత్తి చూపిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిపోయిందని ఆరోపించారు. కేసీఆర్‌ను జైలుకు పంపుతామంటూ కాంగ్రెస్ చాలాసార్లు బహిరంగంగానే ప్రకటించిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ఆయన పాల్పడిన అవినీతిపై విచారణ ఎందుకు జరపలేదని ప్రశ్న సంధించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కైయ్యాయని ఆరోపించారు.
Follow Us On : WhatsApp

