కలం డెస్క్ : జూబ్లీ హిల్స్(Jubilee Hills) అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార విపక్షాలు వేర్వేరు నినాదాలను ఇచ్చాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ చనిపోవడంతో వచ్చిన ఉప ఎన్నికలో మరోసారి గెలవాలని భావించిన బీఆర్ఎస్ ఆయన భార్యనే అభ్యర్థిగా నిలబెట్టింది. సానుభూతి, సెంటిమెంట్ కలిసొస్తుందని గంపెడాశలు పెట్టుకున్నది. ఆ స్థానాన్ని నిలబెట్టుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. మరోవైపు గ్రేటర్ పరిధిలో బలహీనంగా ఉన్న పార్టీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పటిష్ట వ్యూహాన్ని రచించింది. డెవలప్‌మెంట్ అస్త్రాన్ని ప్రయోగించింది. ప్రజలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) పిలుపునిచ్చారు. సెంటిమెంట్ వర్సెస్ డెవలప్‌మెంట్ అంశాన్ని లేవనెత్తారు. చివరకు ప్రజలు డెవలప్‌మెంట్‌కే పట్టం కట్టారు.
బలహీనపడుతున్న బీఆర్ఎస్ :
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తమకు ఎదురు లేదని బీఆర్ఎస్ ఇంతకాలం గంభీర ప్రకటనలు చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఖాతానే తెరవలేకపోయిందని తీవ్ర స్థాయిలో కేటీఆర్ విమర్శలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ గల్లంతేనని కామెంట్ చేశారు. కాంగ్రెస్ ఓడిపోవడానికి ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్‌రెడ్డి తీసుకున్న ‘హైడ్రా’ నిర్ణయం ఒక్కటి చాలు.. పేదల ఇండ్లను కూల్చివేసి వారికి నిలువ నీడ లేకుండా చేశారు.. కేసీఆర్ హయాంలో డబుల్ ఇండ్లు కట్టిస్తే సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఉన్న ఇండ్లనూ కూల్చివేశారు… అని ఆరోపించారు. కానీ కేటీఆర్ కామెంట్లను పట్టించుకోని జనం చివరకు కాంగ్రెస్ అభ్యర్థికే పట్టం గట్టారు. బీఆర్ఎస్ తన ఖాతాలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్(Jubilee Hills) స్థానాలను కోల్పోయింది.
Read Also: నెక్స్ట్ టార్గెట్.. లోకల్ ఫైట్
Follow Us on: Instagram

