కలం డెస్క్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్(Congress Party) అంచనాలను మించి మెజారిటీ సాధించి విజయాన్ని కైవశం చేసుకోవడంతో ఆ పార్టీ తదుపరి ఫోకస్ స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. ఈ ఫలితం ప్రభావం స్థానిక ఎన్నికలపై గణనీయంగా ఉంటుందన్న అంచనాలు అన్ని ప్రధాన రాజకీయ పార్టీల్లో మొదలైంది. బీసీ రిజర్వేషన్ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున దానిపై ఎలాంటి నిర్ణయం వెలువడినా ఎక్కువ స్థానాలు మాత్రం కాంగ్రెస్‌కే వస్తాయనే నమ్మకం ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొన్నది. జూబ్లీ హిల్స్ విజయం ఉత్సాహంతో ఆ పార్టీ కేడర్ ఇకపైన లోకల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టనున్నారు.
డిసెంబరు చివర్లో లోకల్ ఫైట్?
స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినా బీసీలకు 42% రిజర్వేషన్ అంశం లీగల్ చిక్కుల్లో పడడంతో ఎన్నికలకు బ్రేక్ పడింది. ఈ సమయంలోనే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఫలితం అనుకూలంగా రావడంతో కాంగ్రెస్(Congress Party) కేడర్‌లో ఉత్సాహం రెట్టిపైంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కేడర్‌కు తగిన గుర్తింపు, గౌరవం ఇస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో ఇకపైన కేడర్ ఆశలన్నీ వార్డు మెంబర్ మొదలు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పోస్టులపై పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుని స్థానిక ఎన్నిలకు వెళ్తుందన్న అంచనాలు మొదలయ్యాయి.
రెండో వార్షికోత్సవం తర్వాత?
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరి డిసెంబరు 7వ తేదీ నాటికి రెండేండ్లు పూర్తవుతున్నందున సంబురాలను ఘనంగా జరుపుకోవాలని ఆ పార్టీ భావిస్తున్నది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నది. తొలుత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను పార్టీ గుర్తుపై నిర్వహించి దానికి కొనసాగింపుగా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను నిర్వహించాలన్నది ఆ పార్టీ ఉద్దేశం. ఈ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై స్పష్టతకు రానున్నది. జనవరి చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలన్నది ఆ పార్టీ భావన. బీఆర్ఎస్, బీజేపీలను చిత్తుగా ఓడించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ గ్రామస్థాయి నుంచి పటిష్ట వ్యూహాన్ని అవలంబించనున్నది.
Read Also: బండి సంజయ్ అంచనాలు ఫెయిల్
Follow Us on: Instagram

