నకిలీ మద్యం వ్యవహారంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్(Jogi Ramesh) వ్యాఖ్యానించారు. నిజంగా చెప్పుకుంటున్నట్లు సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే.. సిట్ అంటూ కాలక్షేపం చేయకుండా సీబీఐ దర్యాప్తు కోరాలని ఛాలెంజ్ చేశారు. అప్పుడే ప్రజలు ఆయనను నమ్ముతారని అన్నారు. కోట్లు కూడబెట్టుకోవడానికి కూటమి చేస్తున్న నకిలీ మద్యం వ్యవహారం బయటపడటంతో చంద్రబాబు(Chandrababu) తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శలు గుప్పించారు. తప్పుడు కేసులు పెట్టి అసలు విషయాన్ని పక్కదారి పట్టించడం అనేది చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని చురకలంటించారు. ఈ సిట్.. చంద్రబాబు చేతుల్లో ఉండే సిట్ అని అన్నారు. చంద్రబాబు కూర్చోమంటే కూర్చొనే.. నిల్చోమంటే నిల్చునే సిట్‌ను పక్కనబెట్టి సీబీఐ దర్యాప్తు కోరాలని డిమాండ్ చేశారు జోగి రమేష్.
నకిలీ మద్యం కేసులోని ప్రధాన నిందితుల్లో ఒకరైన జనార్ధన్ రావు విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది. వైసీపీ(YCP) హయాంలో జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారు చేసినట్లు జనార్ధన్ రావు అంగీకించారు. కాగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే నిఘా పెట్టడంతో అసలు వ్యవహారం వెలుగు చూసిందని అన్నారు. మళ్లీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడం కోసం మళ్ళీ నకిలీ మద్యం తయారీ స్టార్ట్ చేయాలని తనకు జోగి రమేష్(Jogi Ramesh) చెప్పారని కూడా జనార్ధన్ రావు తన వీడియోలో పేర్కొన్నారు. ఈ అంశం సంచలనం రేకిస్తున్న క్రమంలో దీనిపై జోగి రమేష్ స్పందించారు.
Read Also: నకిలీ మద్యంపై సర్కార్ కీలక నిర్ణయం..

