కలం, జనగామ : జిల్లాలో మత్తు పదార్థాల వినియోగాన్ని, రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా (Jangaon Collector) అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో డీసీపీ రాజ మహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ లతో కలిసి వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత మత్తుకు బానిసలై తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కలెక్టర్ హితవు పలికారు.
మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు పెయింటింగ్, వ్యాస రచన పోటీలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, బహిరంగ ప్రదేశాల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ (Jangaon Collector Sandeep Kumar) అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా రహదారుల పక్కన ఉన్న దాబాల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలని, ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణాను అడ్డుకోవాలని పోలీసు, ఎక్సైజ్ శాఖలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఏఓ అంబికా సోనీ, ఎక్సైజ్ ఎస్పీ అనిత, ఆర్టీఓ శ్రీనివాస్ గౌడ్, డీఎంహెచ్ఓ మల్లిఖార్జున రావు తదితర అధికారులు పాల్గొన్నారు.
Read Also: కాంట్రవర్సీ కౌశిక్.. ఫ్యూచర్ ఏంటి?
Follow Us On : WhatsApp

