కాంట్రవర్సీ కౌశిక్​.. ఫ్యూచర్ ఏంటి?

కలం, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు. ఇంతకాలం మాటలతో ఆయన వివాదాస్పదులయ్యారు. ఇప్పుడు చేష్టలతోనూ సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. నోరుజారడం, ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం ఆయనకు రొటీన్ ప్రాక్టీస్‌గా మారింది. లీడర్‌గా ఎదగాలనే కోరికతో ‘వివాదాల’ మార్గాన్ని ఎంచుకున్నారనే అపవాదు సైతం లేకపోలేదు. రాష్ట్రమంతా తన గురించే చర్చించుకోవాలనే తపన కూడా ఒక కారణం కావచ్చన్నది కొందరు గులాబీ శ్రేణుల భావన. శాసనసభలో వ్యవహరించాల్సిన తీరుపై ఇటీవలే ఓరియంటేషన్ క్లాసుల్లో ఆయన నేర్చుకున్నది ఇదేనా?.. పార్టీ సీనియర్లు నేర్పింది కూడా ఇదేనా?.. అంటూ అసెంబ్లీ లాబీల్లోనే చర్చ జరుగుతున్నది. పాపులారిటీ పెంచుకోడానికి, పార్టీ పెద్దల దృష్టిలో పడడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎంచుకున్నారన్న మాటలూ వినిపిస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో హుజూరాబాద్ ఓటర్లను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసిన కౌశిక్‌రెడ్డి.. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి అసెంబ్లీలోనే సహచర ఎమ్మెల్యేను సైగలతో బెదిరించారన్న ఆరోపణలకు కేంద్ర బిందువయ్యారు. కేబినెట్ ఆమోదించిన ఎమ్మెల్సీల ఫైల్‌కు ఆమోదం తెలపకుండా పెండింగ్‌లో పెట్టారంటూ నాటి మహిళా గవర్నర్ తమిళిసైపై అసభ్యకర పదజాలంతో దూషించడం, మహిళా సంఘాల నుంచి తీవ్ర నిరసనలు రావడం, జాతీయ మహిళా కమిషన్ సీరియస్ కావడం, చివరకు ఢిల్లీ వెళ్లి క్షమాపణలు చెప్పడం.. ఇవన్నీ కౌశిక్‌రెడ్డి నోటిదురుసుతనానికి నిదర్శనం. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించకపోతే కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానంటూ వీడియో రిలీజ్ చేసి ‘సూసైడ్ స్టార్’గా మారారు. ఇప్పటికీ ప్రత్యర్థుల నుంచి ఆ విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు.

ఆ మధ్య పోలీస్ అధికారిని బూతులు తిట్టడం, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హడావిడి చేయడం.. వీటికి కొనసాగింపుగా తాజాగా అసెంబ్లీలో సహచర ఎమ్మెల్యే కడియం శ్రీహరిపైకి తుపాకీ ఎక్కుపెడ్తున్నట్లు చేతులతో సైగలు చేసి కొత్త వివాదానికి కారకులయ్యారు పాడి కౌశిక్‌రెడ్డి. ఆయన తీరును పార్టీ సమర్థిస్తున్నదా? అది వ్యక్తిగత వ్యవహారమంటూ బుకాయిస్తుందా? పార్టీకి నష్టం జరుగుతున్నదంటూ శ్రేణులు తలలు పట్టుకుంటున్నా పార్టీ పెద్దలు మాత్రం సైలెంట్. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వెనుకేసుకొస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు. ఓవైపు ‘ఫ్యామిలీ సూసైడ్’ బెదిరింపులు.. ఇంకోవైపు ‘మర్డర్ సైగలు’.. అన్నట్లుగా తయారైంది పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం.

సహచర ఎమ్మెల్యేను కాల్చేస్తానంటూ నిండు సభలోనే పాడి కౌశిక్ రెడ్డి అనడం క్షమించరానిదని, ఆయన సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని బీఆర్ఎస్ మినహా మిగిలిన పార్టీల ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. చివరకు ఆయన సైగల బెదిరింపు వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేశారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇది రానున్న రోజుల్లో ఎటువైపు దారితీస్తుందన్నది హాట్ టాపిక్‌గా మారింది. కౌశిక్ రెడ్డి తీరు, వివాదాలపై కలం స్పెషల్ ఎడిషన్ చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Padi Kaushik Reddy
Padi Kaushik Reddy

Read Also: మావోయిస్టు పార్టీ : 60 ఏళ్ళ ప్రస్థానం.. రెండేళ్లలో పతనం!?

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>