కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో ఔల్ క్లబ్ (Owl Club) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాస్కెట్‌బాల్ (Karimnagar Basketball) టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికితీసే లక్ష్యంతో అండర్-14, అండర్-17, అండర్-19 విభాగాలలో ఈ పోటీలను ఏర్పాటు చేశారు. ఈ టోర్నమెంట్‌ను కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ మేయర్ రవీందర్ సింగ్, బిర్లా ఓపెన్ మైండ్స్ అండ్ ట్రినిటీ చైర్మన్ డి. ప్రశాంత్ రెడ్డి, తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ సీనియర్ ప్రెసిడెంట్ మహిపాల్, కిస్నా గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ ప్రతినిధి వరుణ్ సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ టోర్నమెంట్‌కు జిల్లావ్యాప్తంగా ఉన్న వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి అనూహ్య స్పందన లభించింది. సుమారు 25 జట్లు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకుంటున్నాయి. యువ క్రీడాకారులలో దాగి ఉన్న ప్రతిభను సానబెట్టి, వారిని జిల్లా, రాష్ట్ర స్థాయి జట్లకు ఎంపికయ్యేలా తీర్చిదిద్దడమే ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడాభిమానులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

