కలం, నల్లగొండ : నల్లగొండ పట్టణ శివారు ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రింగ్ రోడ్ (Nalgonda Ring Road) పనులపై నాణ్యత అంశం వివాదాస్పదంగా మారింది. నాసిరకం మట్టి, యేనగుండ్లు, కంకర వాడుతున్న కాంట్రాక్టర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవిగౌడ్ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ (Collector Chandrasekhar) కు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రవిగౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న ఈ రింగ్ రోడ్ కోసం సమీపంలోని చెరువులు, కుంటల నుంచి అక్రమంగా మట్టిని తవ్వి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండా చెరువు మట్టిని రోడ్డు నిర్మాణంలో వాడటం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు.
చెరువుల్లో మట్టి తవ్వడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని, జంతువులకు తాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా, 14 కిలోమీటర్ల రింగ్ రోడ్ (Nalgonda Ring Road) నిర్మాణానికి డీపీఆర్ ప్రకారం రూ.516 కోట్ల అంచనా వ్యయం ఉండగా, ప్రస్తుతం దాన్ని రూ.900 కోట్లకు పెంచినట్లు తెలిపారు. బుద్ధారం, కంచనపల్లి, రాములబండ, పానగల్ గేట్లు, అనంతారం, అన్నేశ్వరమ్మ గుట్ట ప్రాంతాల్లో చెరువు మట్టి, యేనగుండ్లు వాడుతున్నట్లు పేర్కొన్నారు.
నాణ్యతను పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నాణ్యత లేకుండా నిర్మించిన రోడ్లు కొద్ది కాలంలోనే దెబ్బతింటాయని, చివరకు ప్రజలపై అదనపు పన్నుల భారం పడుతుందని హెచ్చరించారు. ఈ అంశంపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Also: కాంట్రవర్సీ కౌశిక్.. ఫ్యూచర్ ఏంటి?
Follow Us On: Instagram

