కలం, వెబ్ డెస్క్: తమ పార్టీలో చేరికల సమన్వయానికి జాయినింగ్స్ కమిటీని జనసేన పార్టీ (Janasena Party) ప్రకటించింది. 14 మంది సభ్యులతో ఆంధ్ర ప్రదేశ్ కమిటీ ఏర్పాటు చేసింది. త్వరలో తెలంగాణ కమిటీని ప్రకటించనుంది. జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న ఇతర పార్టీల నేతలు, విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థులను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా జాయినింగ్స్ కమిటీని నియమించినట్లు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. ఏపీకి చెందిన వారి చేరికలను 14 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ సమన్వయం చేస్తుందని తెలిపారు.
ఈ కమిటీలో ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, పంతం నానాజీ, ఎంపీ లింగమనేని రమేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సామినేని ఉదయభాను, పార్టీ సీనియర్ నేతలు కొటికలపూడి చినబాబు, డా.హరిప్రసాద్, డా.పెదపూడి విజయ్ కుమార్, కొరికాన రవికుమార్, వంపూరు గంగులయ్య, టి సి వరుణ్, ఆరణి మదన్ సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటన అనంతరం ఈ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీలో చేరికలపై దిశానిర్దేశం చేసినట్లు పేర్కొన్నారు. ఏపీ తరహాలోనే తెలంగాణలోనూ జాయినింగ్స్ కమిటీ నియామకానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

