Mobile Popup Ad
Mobile Popup Ad

ఇండియాలో టెలిగ్రామ్ బ్యాన్.. కేంద్రం సంచలన నిర్ణయం!

కలం, వెబ్ డెస్క్ : దేశంలో అత్యున్నత వైద్య విద్యా కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (UG) 2026 రీ-ఎగ్జామినేషన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్’ పై భారతదేశంలో తాత్కాలిక నిషేధం (Telegram Ban) విధిస్తూ కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) కీలక ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) చేసిన సిఫార్సుల మేరకు సమాచార సాంకేతిక చట్టం (IT Act, 2000) లోని సెక్షన్ 69A కింద ఈ చర్యలు తీసుకున్నారు. ఈ నెల 21వ తేదీన నీట్ రీ-ఎగ్జామ్ జరగనుండటంతో, పరీక్షకు ముందు, పరీక్ష ముగిసిన మరుసటి రోజు అంటే జూన్ 22, 2026 వరకు టెలిగ్రామ్ ప్లాట్‌ఫారమ్ అందుబాటులో ఉండదని స్పష్టం చేశారు.

టెలిగ్రామ్ మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌పై జూన్ 30 వరకు ఆంక్షలు

గత కొంతకాలంగా జాతీయ స్థాయి పరీక్షలకు సంబంధించి టెలిగ్రామ్ వేదికగా నకిలీ పేపర్ లీక్ వ్యవహారాలు, మోసపూరిత నెట్‌వర్క్‌లు సాగుతున్నట్లు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) గుర్తించింది. “పేపర్ లీక్డ్ నీట్”, “ప్రైవేట్ మాఫియా” వంటి పేర్లతో ఛానళ్లను సృష్టించి అభ్యర్థుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు తేలింది. ముఖ్యంగా పరీక్ష ముగిసిన తర్వాత టెలిగ్రామ్‌లోని ‘మెసేజ్ ఎడిటింగ్’ ఫీచర్‌ను వాడుకుని, పాత మెసేజ్‌లను ఎడిట్ చేసి ప్రశ్నపత్రాలను ముందే లీక్ చేసినట్లు అభ్యర్థులను నమ్మిస్తున్నట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. ఈ రకమైన తప్పుడు సాక్ష్యాల సృష్టిని అరికట్టడానికి వీలుగా జూన్ 30, 2026 వరకు ఇండియాలో టెలిగ్రామ్ మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను పూర్తిగా నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది.

విద్యార్థుల భద్రత కోసమే చర్యలు

ఈ వ్యవహారంపై బీహార్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల పోలీసు విభాగాలతో పాటు కేంద్ర హోంశాఖ పరిధిలోని I4C విభాగం నిరంతరం నిఘా ఉంచింది. ఇప్పటివరకు మోసపూరిత ప్రకటనలు చేస్తున్న అనేక టెలిగ్రామ్ ఛానళ్లు, గ్రూపులు, బాట్లను తొలగించారు. నీట్ రీ-ఎగ్జామ్ పూర్తి పారదర్శకంగా, సురక్షితంగా నిర్వహించేందుకే ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. పరీక్షకు వెలుపల ఎలాంటి లీకేజీలు లేవని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మి అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు మోసపోవద్దని బీహార్ పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ యూనిట్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>