కలం, వెబ్‌డెస్క్: సాధారణ రోజులతో పోలిస్తే వర్షాకాలంలో మన జుట్టు అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. ఈ కాలంలో గాలిలో తేమ విపరీతంగా ఉంటుంది. కాబట్టి జుట్టు వేగంగా ఊడిపోవడం ప్రారంభమవుతుంది. వర్షపు నీటిలో ఉండే కాలుష్య కారకాలు, స్కాల్ప్‌పై పేరుకుపోయే చెమట వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల సాధారణ రోజుల కంటే వర్షాకాలంలో హెయిర్ ఫాల్ సమస్య దాదాపు రెట్టింపు అవుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇలాంటి సమస్యల నుంచి బయట పడి జుట్టును సంరక్షించుకునేందుకు (Hair Care) కొన్ని పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కొబ్బరి నూనెతో తలకు మసాజ్ చేయడం
మన జుట్టు ఆరోగ్యంలో కొబ్బరినూనె కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే కొబ్బరి నూనెలో జుట్టుకు బలాన్ని ఇచ్చే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే గోరువెచ్చగా చేసిన కొబ్బరి నూనెను చేతి వేళ్లతో తీసుకుని నెమ్మదిగా తలకు మసాజ్ చేయాలి. దీని వల్ల జుట్టు మెరుస్తూ ఆరోగ్యంగా కనిపిస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఈ పద్ధతిని వారానికి ఒక్కసారి పాటించడం వలన మంచి ఫలితం ఉంటుందట.
2. మెంతులను వాడటం
జుట్టు కుదుళ్లను బలంగా మార్చడంలో మెంతులు చాలా సహాయపడతాయని సూచిస్తున్నారు నిపుణులు. దీని కోసం మెంతులను రాత్రంతా నీటిలో నానపెట్టాలి. ఇలా నానబెట్టిన మెంతులను ఉదయాన్నే పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, 15 నుంచి 20 నిమిషాలపాటు ఉంచాలి. ఆ తర్వాత తల స్నానం చేయాలి. దీని వల్ల జుట్టు కుదుళ్లు బలపడి, వెంట్రుకలు రాలడం తగ్గుతుందని సూచిస్తున్నారు నిపుణులు. ఈ పద్ధతిని వారానికి ఒక్కసారి తప్పకుండా పాటించాలి.
3. కలబంద జెల్ వాడటం
జుట్టుకు మంచి పోషణను ఇచ్చి వాటిని మృదువుగా మార్చే గుణం అలోవెరా జెల్‌లో ఉంటుందని చెబుతున్నారు. దీని కోసం, తాజాగా తీసిన అలోవెరా జెల్‌ను మీ తలకు రాసి, 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి. దీని వలన జుట్టు మృదువుగా ఉంటుంది. అంతే కాకుండా తేమను కోల్పోకుండా నిగనిగలాడుతూ కనిపిస్తుందట. ఈ పద్ధతిని వారానికి ఒక్కసారి పాటించడం వలన మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
4. ఉల్లిపాయ రసం వాడటం
ఒత్తైన, పొడవైన కురుల కోసం ఉల్లిపాయ రసం ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు. ఉల్లిపాయ రసంలో ఉండే కొన్ని పదార్థాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడతాయట. దీని కోసం, ఒక ఉల్లిపాయను తురిమి, దాని రసాన్ని తీసుకోవాలి. ఈ రసాన్ని 15 నుంచి 20 నిమిషాల పాటు తలకు పట్టించి అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును వాష్ చేయాలి. ఈ పద్ధతిని వారానికి ఒక్కసారి పాటించడం వల్ల జుట్టుకు కొత్త జీవం వచ్చి, బలంగా తయారవుతుందని చెబుతున్నారు నిపుణులు.
5. పెరుగును వాడటం
జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో పెరుగు కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు. పెరుగులో ఉండే పోషకాలు స్కాల్ఫ్ రక్షణకు ఉపయోగపడడంతో పాటు జుట్టును మృదువుగా ఉంచుతాయట. దీని కోసం, ఒక గిన్నెలో రెండు చెంచాల పెరుగు తీసుకుని, అందులో ఒక చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత, గోరువెచ్చని నీటితో వాష్ చేయాలి. ఈ పద్ధతిని వారానికి ఒక్కసారి తప్పకుండా పాటించడం వల్ల జుట్టు మృదువుగా ఉండటమే కాకుండా, తేమగా కూడా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

