కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో అక్రమకట్టడాలపై ఉక్కుపాదం మోపుతూ.. ఎక్కడికక్కడ నిర్మాణాలను కూల్చేస్తూ ప్రభుత్వ భూమిని పరిరక్షిస్తున్న హైడ్రా (HYDRAA).. ఐటీ కారిడార్ లో భారీ ఆపరేషన్ నిర్వహించింది. బడా నిర్మాణ సంస్థల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని అక్రమార్కుల కోరల్లో చిక్కుకోకుండా కాపాడింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ (Khanamet) గ్రామం సర్వే నంబర్ 55లోని 8 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిని మంగళవారం హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఐటీ హబ్ కి చేరువలో బడా రియల్ ఎస్టేట్ సంస్థల స్వాధీనంలో ఉన్న 4.20 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు.. కొలను మాధవరెడ్డి కూతురు సబితకు చెందిన 4 ఎకరాల భూమిని సైతం కాపాడింది. ఇందులో తాత్కాలికంగా వేసిన షెడ్డులను కూల్చివేసింది.
ప్రభుత్వ భూమిలో నెలకొల్పిన ఆర్‌సీసీ ప్లాంట్‌ను వాసవి నిర్మాణ సంస్థ స్వయంగా తొలగించుకుంది. కార్మికులకోసం వేసిన తాత్కాలిక షెడ్డులను తొలగించినట్లు హైడ్రా (HYDRAA) స్పష్టం చేసింది. మొత్తం 8 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగించి బోర్డులు ఏర్పాటు చేసింది. హైడ్రా కాపాడిన ఈ భూమి విలువ మార్కెట్ ధర ప్రకారం రూ. 1200ల కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతంలోనూ ఇక్కడ ఆక్రమణలను హైడ్రా తొలగించింది. సర్వే నంబరు 53లోని మొండికుంట ఆక్రమణలతో పాటు సర్వే నంబరు 55లోని ప్రభుత్వ భూమిని 11 ఎకరాల వరకూ హైడ్రా స్వాధీనం చేసుకుంది.
Read Also: ‘తనను తాను ప్రేమించలేని వాడు.. ఇతరులను ప్రేమించలేరు’ ఇందులో వాస్తవం ఎంత?
Follow Us On: Instagram

