‘తనను తాను ప్రేమించలేని వాడు.. ఇతరులను ప్రేమించలేరు’ ఇందులో వాస్తవం ఎంత?

కలం, వెబ్ డెస్క్ : ప్రేమ, బంధాల గురించి సోషల్ మీడియాలో మనం తరచూ ఒక మాట వింటుంటాం.. “నిన్ను నువ్వు ప్రేమించుకోలేకపోతే, ఇక ఎవరినీ ప్రేమించలేవు” అని, ఇంటర్నెట్ నుంచి టీ-షర్టుల వరకు ఎక్కడ చూసినా కనిపించే ఈ మాటలో అస్సలు నిజం లేదని పోర్ట్‌ ల్యాండ్‌కు చెందిన ప్రముఖ కౌన్సిలర్ జెఫ్ గుంతర్ (Jeff Guenther) కుండబద్దలు కొట్టారు. అసలు ఈ మాట ఎంత పెద్ద అబద్ధమో ఆయన వివరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

నిజ జీవితం వేరు.. కొటేషన్లు వేరు :

మార్చి 30న జెఫ్ గుంతర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అంశంపై స్పందిస్తూ.. మన చుట్టూ ఉన్న ఉదాహరణలే ఈ మాట తప్పు అని నిరూపిస్తున్నాయని చెప్పారు. తమను తాము అసహ్యించుకునే వారు కూడా తమ పిల్లలను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. తీవ్రమైన డిప్రెషన్‌లో ఉండి తన మీద తనకే నమ్మకం లేని వ్యక్తి కూడా తన స్నేహితుడి కోసం కొండంత అండగా నిలబడతాడు. వీరందరిలోనూ ప్రేమ ఉంది, ఆ ప్రేమ నిజమైనది కూడా. కాబట్టి మనల్ని మనం ప్రేమించుకోవడం అనేది ఇతరులను ప్రేమించడానికి కండిషన్ కాదని ఆయన స్పష్టం చేశారు.

అసలు ఆ మాట అర్థం ఏంటి?

ఈ కొటేషన్ చెప్పాలనుకున్న విషయం వేరని జెఫ్ అభిప్రాయపడ్డారు. గతంలో జరిగిన కొన్ని చేదు అనుభవాల వల్ల మన ప్రవర్తనలో కొన్ని అలవాట్లు ఏర్పడతాయి. అవే బంధాలలో చిన్న చిన్న గొడవలకు కారణం అవుతుంటాయి. దీనిని “ప్రేమించలేకపోవడం” అనలేమని, ఇది కేవలం మన మనసు నేర్చుకున్న ఒక పద్ధతి మాత్రమేనని ఆయన వివరించారు. దీనిని ఖచ్చితంగా సరిదిద్దుకోవచ్చని కూడా భరోసా ఇచ్చారు.

కొటేషన్ వల్ల కలిగే నష్టం

ఈ మాటను నమ్మడం వల్ల ఇప్పటికే బాధలో ఉన్నవారు, తాము ప్రేమకు పనికిరామని అనుకునే ప్రమాదం ఉందని జెఫ్ (Jeff Guenther) హెచ్చరించారు. “మమ్మల్ని మేము సరిచేసుకున్న తర్వాతే ఎవరినైనా ప్రేమిస్తాం” అని చాలామంది ఒంటరిగా ఉండిపోతున్నారు. నిజానికి ఇది స్వయం అవగాహన కాదు, కేవలం ఒంటరితనం మాత్రమేనని ఆయన విశ్లేషించారు. చాలామంది ఇతరులను ప్రేమించడం ద్వారానే తమ గొప్పతనాన్ని గుర్తిస్తారు. బంధాల్లో బాధ్యతగా ఉండటం వల్లే “నేను కూడా మంచి వ్యక్తిని” అనే నమ్మకం వారిలో పుడుతుంది. మనుషులు ఒకరితో ఒకరు కలిసి ఉండటానికే పుట్టారని, ఆ అనుబంధాల మధ్యే మనసుకి కావాల్సిన ప్రశాంతత లభిస్తుందని జెఫ్ స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో కనిపించే ప్రతి మాటను గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదని గుంతర్ వివరించారు. ప్రేమ అనేది కేవలం మనపై మనకు ఉండే అభిప్రాయం మీద మాత్రమే ఆధారపడదని, బంధాల్లో ఉండే ఒడిదుడుకులను సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగడమే అసలైన జీవితమని ఆయన వివరించారు.

Read Also: పర్యాటకంలో కొత్త ట్రెండ్.. నిద్ర కోసమే విహారయాత్రలు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>