కలం, వెబ్ డెస్క్: న్యూ ఇయర్ సంబురాల వేళ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కఠిన ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) అమలు చేస్తున్నారు. డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1 అర్ధరాత్రి వరకు నగరంలోని ఫ్లై ఓవర్ లు మొత్తం క్లోజ్ చేయనున్నారు. ఈ మేరకు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ఆర్ వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు.
217 జంక్షన్ల వద్ద సిబ్బంది
నగరవ్యాప్తంగా 217 ముఖ్య ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ నియంత్రించేందుకు సిబ్బందిని ఏర్పాటు చేయబోతున్నారు. మార్కెట్లు, మాల్స్ ఎక్కువగా ఉండే ప్రదేశాలపై పోలీసులు దృష్టి సారించనున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ వ్యాప్తంగా కఠిన ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించనున్నారు.
ఈ ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్
ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ (పీవీఎన్ఆర్ మార్గ్)లపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి ట్యాంక్ బండ్, చుట్టుపక్కల రోడ్లపై అన్ని రకాల వాహనాలకు ఆంక్షలు విధించనున్నారు. ముఖ్యంగా రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 ఉదయం 2 గంటల వరకు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్‌పై వాహనాలకు పూర్తిగా అనుమతి ఉండదు. హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల రోడ్లపై వివిధ డైవర్షన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్, ఇక్బాల్ మీనార్, సెక్రటేరియట్ జంక్షన్, లిబర్టీ, రాణిగంజ్ వంటి ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు డైవర్ట్ చేస్తారు.
భారీ వాహనాలపై నిషేధం
బేగంపేట, టోలిచౌకీ తప్ప మిగతా అన్ని ఫ్లైఓవర్లను అవసరాన్ని బట్టి మూసివేస్తారు. అయితే, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల కోసం పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే ఫ్లైఓవర్ తెరిచి ఉంచుతారు (విమాన టికెట్ ఉన్నవారికి మాత్రమే). డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 ఉదయం 2 గంటల వరకు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, లారీలు, భారీ వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సులు ఔటర్ రింగ్ రోడ్ మార్గాన్ని ఉపయోగించాలని సూచించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్
నూతన సంవత్సర వేడుకల (New Year Celebrations) సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడింగ్, స్టంట్ బైకింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా, ట్రిపుల్ రైడింగ్ వంటి ఉల్లంఘనలపై విస్తృత తనిఖీలు నిర్వహిస్తారు. మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10,000 జరిమానా మరియు లేదా 6 నెలల జైలు శిక్ష విధించనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌ను 3 నెలలు లేదా శాశ్వతంగా సస్పెండ్ చేస్తారు. మద్యం సేవించిన వారు క్యాబ్ లను ప్రజారవాణా వ్యవస్థను వాడుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
పార్కింగ్ ఎక్కడ?
ట్యాంక్ బండ్‌కు వెళ్లే సెక్రటేరియట్ పార్కింగ్, ప్రసాద్స్ మల్టీప్లెక్స్ పక్కన హెచ్‌ఎండీఏ పార్కింగ్, ఎన్టీఆర్ స్టేడియం వంటి ప్రాంతాల్లో వాహనాలు పార్క్ చేసుకోవచ్చు. తాజా ట్రాఫిక్ అప్‌డేట్స్ కోసం @HyderabadTrafficPolice ఫేస్‌బుక్ పేజీ లేదా @HYDTP ట్విట్టర్ హ్యాండిల్‌ను ఫాలో అవ్వాలని పోలీసులు సూచించారు. అత్యవసర సహాయం కోసం 9010203626కు కాల్ చేయాలని కోరారు. సురక్షిత ప్రయాణం కోసం ట్రాఫిక్ నియమాలను పాటించాలని, పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.
Read Also: సన్నీలియోన్ ప్రోగ్రామ్ పై సాధువుల ఆగ్రహం
Follow Us On: Youtube


