కలం, వెబ్‌డెస్క్: అన్‌రిజర్వుడ్ టికెట్లు కొనే ప్రయాణికులకు శుభవార్త. ఈ టికెట్లను రైల్‌వన్ యాప్ ద్వారా కొంటే 3శాతం డిస్కౌంట్ ఇస్తారు. ఈ మేరకు మంగళవారం రైల్వే శాఖ ప్రకటించింది. రైల్‌వన్ యాప్‌లో ఏ డిజిటల్ పేమెంట్ ద్వారా కొన్నా ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ వచ్చే ఏడాది జనవరి 14 నుంచి జులై 14 వరకు మాత్రమే ఉంటుందని, ఆ తర్వాత ప్రయాణికుల స్పందనను బట్టి కొనసాగించాలో లేదో నిర్ణయిస్తామని రైల్వే శాఖ తెలిపింది. అలాగే ప్రస్తుతం రైల్‌వన్ యాప్‌లో (Railone App) ఆర్–వాలెట్ పేమెంట్ ద్వారా అన్‌రిజర్వుడ్ టికెట్లు కొనుగోలు చేసేవాళ్లకు లభించే క్యాష్‌బ్యాక్‌ను అన్ని డిజిటల్ పేమెంట్లకూ వర్తింపచేశారు.
కాగా, అన్‌రిజర్వుడ్ టికెట్ (Unreserved Ticket) అంటే ముందుగా సీట్ లేదా బెర్త్ కేటాయింపు లేకుండా ప్రయాణించేందుకు తీసుకునే టికెట్. వీటిని సాధారణంగా రోజువారీ, స్వల్ప దూర ప్రయాణాలకు ఎక్కువగా తీసుకుంటారు. ఇందులో సీటు గ్యారంటీ ఉండదు. దీని ధర రిజర్వేషన్ టికెట్ల కంటే చాలా తక్కువగా ఉంటుంది. పాసింజర్, డెమూ ట్రైన్లతోపాటు ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని జనరల్ కోచ్‌లలో ఈ టికెట్లతో ప్రయాణించవచ్చు. వీటిని ఇంతకుముందు కేవలం రైల్వే స్టేషన్ కౌంటర్లలో మాత్రమే తీసుకునే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం యూటీఎస్/రైల్‌వన్ యాప్ (Railone App) ద్వారానూ తీసుకోవచ్చు. రైల్వేశాఖ ప్రకటించిన 3శాతం డిస్కౌంట్ కేవలం రైల్‌వన్ యాప్ ద్వారా అన్‌రిజర్వుడ్ టికెట్లు కొంటేనే వర్తిస్తుంది.
Read Also: ఆ కంటెంట్ తీసేయండి.. సోషల్ మీడియా యాప్ లకు కేంద్రం వార్నింగ్
Follow Us On: X(Twitter)


