కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సర్వీసులు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. స్వీయ ఆదాయ వనరులు పెంచుకునేందుకు ప్రయత్నించాలని అధికారులకు సీఎం సూచించారు. ఈ మేరకు ఎంఎంటీఎస్ సర్వీసులపై శానసమండలి హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఎంఏయూడీ స్పెషల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఆర్ అండ్ బీ వికాస్ రాజ్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, హెచ్‌యూఎంటీఏ ఎండీ జీవన్ బాబు, దక్షిణ మధ్య రైల్వే డీసీఎం చరణ్ నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంఎంటీఎస్‌లో ప్రతి ఏడాది ప్రయాణికుల తగ్గుముఖంపై సీఎం ఆరా తీశారు.కార్యాలయాల సమయాల్లో ఎంఎంటీఎస్‌ల సంఖ్య పెంచడంతో పాటు క్రమం తప్పకుండా సమయ పాలన పాటిస్తూ సర్వీసులు నడపాలని సీఎం ఆదేశించారు. మెరుగైన వసతులు ఉన్నప్పుడే ప్రయాణికులు ఎంఎంటీఎస్ వైపు మొగ్గు చూపుతారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎంఎంటీఎస్ స్టేషన్ల వద్దకు ఆర్టీసీ బస్సులు వెళ్లేందుకు అవకాశం లేకపోవడం, స్టేషన్లు లోపలికి ఉన్నందున అక్కడకు రాకపోకలు సాగించేందుకు వీలుగా మినీ బస్సులు నడిపే అంశాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశించారు. ఎంఎంటీఎస్ స్టేషన్లలో ప్రయాణికులకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలన్నారు. . లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెంపుతో పాటు ప్రయాణికుల సంఖ్య పెంపు.. వసతులు మెరుగుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

