ఆదివాసీ గిరిజనుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది కేసీఆరే!: మాజీ మంత్రి పువ్వాడ

​కలం, ఖమ్మం బ్యూరో: ఆదివాసీ గిరిజనుల దశాబ్దాల కలలను, ఆకాంక్షలను సాకారం చేసి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఏకైక నాయకుడు బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ (Puvvada Ajay) స్పష్టం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఆదివాసీ గిరిజనులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. గిరిజనుల దశాబ్దాల డిమాండ్లను నెరవేర్చేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని, వారి హక్కుల పరిరక్షణకు కట్టుబడి పనిచేసిందని కొనియాడారు.

​విధ్వంసపు దారుల నుంచి వికసిత తోవలకు నడిపిస్తూ, మోడువారిన గిరిజనుల బతుకుల్లో మోదుగుపూల పరిమళాలు నింపేలా కేసీఆర్‌ పాలన సాగిందని పువ్వాడ వివరించారు. “మావ నాటే మావే రాజ్.. మా తండాలో మా రాజ్యం” అనే సుదీర్ఘకాల ప్రజాస్వామిక ఆకాంక్షను సాకారం చేస్తూ, అనేక గూడేలు, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనులకు స్వయంపాలన అధికారాలను అందించిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. అటవీ భూములపై గిరిజనులకు పూర్తి హక్కులు కల్పిస్తూ పెద్ద ఎత్తున పోడు భూముల హక్కు పత్రాలను (పట్టాలను) అందజేశామని గుర్తుచేశారు.

​గిరిజనులు ఆత్మగౌరవంతో జీవించేలా విద్య, ఉద్యోగ రంగాల్లో వారి భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు 10 శాతం రిజర్వేషన్లను అమలు చేసి తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా నిలిపామని తెలిపారు. కేసీఆర్‌ హయాంలో గిరిజన సబ్‌-ప్లాన్‌ను పటిష్టంగా అమలు చేయడంతో పాటు గిరిజన సహకార సంస్థ ద్వారా విస్తృత ఉపాధి అవకాశాలను కల్పించినట్లు చెప్పారు. అటవీ ఉత్పత్తులకు ‘గిరి’ బ్రాండ్‌ను ప్రోత్సహిస్తూ వాటి విక్రయాలకు సరైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించి, గిరిజనుల ఆర్థిక పురోగతికి తోడ్పాటునందించామని పేర్కొన్నారు. ఆదివాసీ గిరిజనుల హక్కులు, స్వయంపాలన, ఆర్థికాభివృద్ధి కోసం కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>