కలం డెస్క్: పర్సనల్ లోన్స్ (Personal Loans) తీసుకోవడం కానీ, ఇవ్వడం కానీ ఇండియాలో రోజు రోజుకు పెరిగిపోతోంది. లోన్ ఆఫర్లు కూడా భారీగానే వస్తుంటాయి. అనుకోకుండా డబ్బు అవసరం వచ్చినప్పుడు ఎలాంటి గ్యారంటీ లేకుండానే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఈ రుణాలను మంజూరు చేస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులు పర్సనల్ లోన్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ సులువైన లోన్లు, సరైన అవగాహన లేకుండా తీసుకుంటే చిక్కుతులు తప్పవు. ఆ లోన్‌లే భవిష్యత్తులో భారీ ఆర్థిక భారం మోపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పర్సనల్ లోన్ తీసుకునే ముందు కచ్చితంగా కొన్ని విషయాలను పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు. మరి ఇంతకీ ఆ అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మొత్తం లోన్ ఖర్చు చూడాలి
పర్సనల్ లోన్లపై వడ్డీ రేట్లు బ్యాంకును బట్టి మారుతుంటాయి. మీ క్రెడిట్ స్కోర్, ఆదాయం, గత లోన్ చరిత్ర ఆధారంగా వడ్డీ నిర్ణయిస్తారు. అయితే చాలామంది కేవలం వడ్డీ రేటును మాత్రమే చూసి లోన్ తీసుకుంటారు. వాస్తవానికి ప్రాసెసింగ్ ఫీజు, ఫోర్‌క్లోజర్ ఛార్జీలు, ఇతర సేవా ఛార్జీలను కలిపి మొత్తం లోన్ ఖర్చు ఎంత అవుతుందో ముందుగానే లెక్కించుకోవాలి. అప్పుడు ఏ బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థ నిజంగా మీకు లాభదాయకమో అర్థమవుతుంది.
ఫీజులు, హిడెన్ ఛార్జీలపై అప్రమత్తం
సాధారణంగా పర్సనల్ లోన్లకు 0.5 శాతం నుంచి 5 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తారు. దీనిపై జీఎస్టీ అదనంగా ఉంటుంది. అలాగే లోన్‌ను ముందుగానే చెల్లిస్తే 2–5 శాతం వరకు ప్రీ-పేమెంట్ లేదా ఫోర్‌క్లోజర్ పెనాల్టీ ఉండొచ్చు. EMI ఆలస్యమైతే లేట్ ఫీజులు, చెక్ బౌన్స్ అయితే అదనపు ఫైన్‌లు విధిస్తారు. ఇవి చట్టపరమైన సమస్యలకూ దారి తీయవచ్చు. అంతేకాదు, క్రెడిట్ స్కోర్ కూడా పడిపోతుంది.
మీ ప్రొఫైల్, ఎలిజిబిలిటీ కీలకం
పర్సనల్ లోన్స్ (Personal Loans) సులభంగా రావాలంటే మీ క్రెడిట్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తుంది. 750 కంటే ఎక్కువ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీ రేటుకు అవకాశాలు పెరుగుతాయి. డెబ్ట్ టు ఇన్‌కమ్ రేషియో (మీ ఆదాయంతో పోల్చిన అప్పుల నిష్పత్తి) 35 శాతం లోపు ఉండాలి. ఉద్యోగులకు స్థిరమైన ఉద్యోగం, నిరంతర ఆదాయం ఉంటే బ్యాంకుల నమ్మకం పెరుగుతుంది.
టెన్యూర్‌ను జాగ్రత్తగా ఎంచుకోవాలి
ఎక్కువ టెన్యూర్ తీసుకుంటే EMI తక్కువగా ఉంటుంది. కానీ మొత్తం వడ్డీ భారం ఎక్కువ అవుతుంది. తక్కువ టెన్యూర్ అయితే EMI ఎక్కువైనా, మొత్తం ఖర్చు తక్కువగా ఉంటుంది. అవసరానికి మించి లోన్ తీసుకోవడం భవిష్యత్తులో ఆర్థిక ఒత్తిడికి కారణమవుతుంది. కాబట్టి మీ రీపేమెంట్ సామర్థ్యాన్ని బట్టి లోన్ అమౌంట్, కాలాన్ని నిర్ణయించుకోవాలి.
ప్రీపేమెంట్ ఫ్లెక్సిబిలిటీ
పార్షియల్ లేదా ఫుల్ ప్రీపేమెంట్‌కు బ్యాంకు అనుమతిస్తుందా? ఉంటే ఫీజు ఎంత? ఇవి ముందుగానే తెలుసుకోవాలి. మీ శాలరీ అకౌంట్ లేదా ఎఫ్‌డీ ఉన్న బ్యాంకులో లోన్ తీసుకుంటే వడ్డీ రేటుపై నెగోషియేట్ చేసే అవకాశం ఉంటుంది. మంచి బ్యాంక్ రిలేషన్ ఉంటే కొంతమేర వడ్డీ తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది.
పర్సనల్ లోన్ తక్షణ అవసరాలకు ఉపశమనంగా అనిపించవచ్చు. కానీ అవగాహన లేకుండా తీసుకుంటే దీర్ఘకాలంలో భారమైన అప్పుగా మారుతుంది. వడ్డీ, ఫీజులు, టెన్యూర్, మీ ఆర్థిక స్థితి అన్నింటినీ సమగ్రంగా అంచనా వేసుకున్న తర్వాతే లోన్ నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
Read Also: పర్సనల్ లోన్‌లో రిస్క్‌లు ఎక్కువ ఉన్నాయా.. ఇలా తగ్గించుకోండి..!
Follow Us On: X(Twitter)


