కలం డెస్క్: అండర్-19 మ్యాచ్(U19 Asia Cup)లో పాకిస్థాన్‌కు భారత్ చిత్తు చేసింది. 90 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించి వరుసగా రెండో గెలుపును నమోదు చేసింది. వర్షం అంతరాయం కారణంగా ఈ మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ 46.1 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. అరోన్ జార్జి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అతను 88 బంతుల్లో 85 పరుగులు చేసి భారత స్కోరును బలంగా నిలబెట్టాడు. అతనికి తోడు కాన్షిక్ చౌహాన్ (46) మరియు ఆయుష్ మాత్రే (38) కీలక భాగస్వామ్యాలు అందించారు. అభిజ్ఞాన్ కుందు 22 పరుగులు జోడించాడు. గత మ్యాచ్‌లో సూపర్ సెంచరీతో మెరిసిన వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) ఈసారి కేవలం 5 పరుగులకే వెనుదిరిగాడు.
పాకిస్థాన్ బౌలర్లలో మహ్మద్ సయ్యమ్ మూడు వికెట్లు పడగొట్టి భారత ఇన్నింగ్స్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. అబ్దుల్ సుభాన్, నికబ్ సాఫిక్ చెరో రెండు వికెట్లు తీయగా, అహ్మద్ హుస్సేన్, అలీ రజా ఒక్కో వికెట్ సాధించారు.
241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ బ్యాటింగ్ భారత బౌలింగ్ దాడికి తట్టుకోలేకపోయింది. 41.2 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. హుజైఫా అహ్సన్ ఒంటరిగా పోరాడుతూ 83 బంతుల్లో 70 పరుగులు చేశాడు. ఫర్హాన్ యూసుఫ్ (23), ఉస్మాన్ ఖాన్ (16) కొంత ప్రతిఘటన చూపించినా, మిగతా బ్యాటర్లు త్వరగా పెవిలియన్ చేరారు.
భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్, కాన్షిక్ చౌహాన్ చెరో మూడు వికెట్లు తీసి పాక్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు. కిషన్ కుమార్ సింగ్ రెండు వికెట్లు తీయగా, ఖిలాన్ పటేల్, వైభవ్ సూర్యవంశీ చెరో వికెట్ సాధించారు.
ఈ విజయంతో భారత్ టోర్నీ(U19 Asia Cup)లో తన ఆధిపత్యాన్ని మరింత బలపరిచింది. యువ ఆటగాళ్ల సమిష్టి ప్రదర్శన జట్టుకు మరింత ఆత్మవిశ్వాసాన్ని అందించింది.
Read Also: పర్సనల్ లోన్ తీసుకునే ముందు తప్పక తెలుసుకోవాల్సిన కీలక అంశాలు
Follow Us On: Pinterest


