epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

దడపుట్టిస్తున్న గోల్డ్ ధరలు.. పెళ్లిళ్ల సీజన్ లో తిప్పలు

కలం, తెలంగాణ బ్యూరో:  తెలంగాణ, ఏపీలో ఏ శుభ ముహూర్తమైనా.. ఏ సంబురమైనా.. బంగారం ఉండాల్సిందే! పెళ్లి వేడుకల్లో అయితే అది మస్ట్!! వచ్చేది మాఘమాసం.. వరుసగా శుభ లగ్నాలు ఉండటంతో పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఈడుకొచ్చిన పిల్లలకు పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే.. బంగారం ధరలు (Gold Prices) మాత్రం వారిని షాక్ కు గురిచేస్తున్నాయి. ఎంతకూ అవి దిగిరావడం లేదు. అంతర్జాతీయంగా రోజురోజుకు పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో గోల్డ్ , సిల్వర్ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి.

తులం రూ. లక్షా 44 వేలు

బంగారం రేట్లు (Gold Prices) రోజుకో ఆల్ టైమ్ హైని క్రియేట్ చేస్తున్నాయి. మంగళవారం వరకు హైదరాబాద్ లో తులం (10 గ్రాములు) 24 క్యారెట్స్ పసిడి రూ. లక్షా 42 వేల 500 వరకు ఉండగా.. అది బుధవారానికి లక్షా 44 వేల వరకు చేరుకుంది. ఇదే 24 క్యారెట్స్ బంగారం జనవరి 8న హైదరాబాద్ లో లక్షా 38 వేలు పలికింది. ఆ తర్వాత పదో తారీఖు నుంచి వరుసగా పెరుగుతూనే ఉంది. ఇక.. 22 క్యారెట్స్ బంగారం జనవరి 8న లక్షా 26వేల 500 పలుకగా.. బుధవారం లక్షా 32 వేల రూపాయలకు చేరుకుంది. గతేడాది అక్టోబర్ లో ఫస్ట్ టైమ్ 24 క్యారెట్స్ బంగారం 10 గ్రాములు రూ. లక్ష మార్కును దాటింది. ఆ తర్వాత నవంబర్ లో లక్షా 29 వేలు, డిసెంబర్ లో లక్షా 35వేలు, ఇప్పుడు లక్షా 44 వేలకు పరుగు పెట్టింది.

ఒక్కరోజులో రూ. 15వేలు పెరిగిన వెండి!

బంగారానికి తోడు వెండి ధరలు (Silver Rate) కూడా పరుగులు పెడ్తున్నాయి. ఒక్కరోజు తేడాతోనే వెండి ధర రూ. 15 వేలు పెరిగింది. మంగళవారం వరకు కిలో వెండి హైదరాబాద్ మార్కెట్ లో రూ. 2 లక్షల 92 వేలు ఉండగా.. అది బుధవారం రూ. 3 లక్షల 7వేలకు చేరుకుంది.

త్వరలో లక్షా 50 వేలు?

బంగారం, వెండి ధరలు అమాంతం పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ స్థాయిలో చోటుచేసుకుంటున్న పరిణామాలే. గ్లోబల్ గా వార్ సిట్యువేషన్ కొనసాగుతుండటం.. తాజాగా ఇరాన్ (Iran) అంశం వంటివి పసిడి, వెండి రేట్లను పరుగులు పెట్టిస్తున్నాయి. ఆర్థిక అనిశ్చితి కూడా ఇందుకు మరో కారణం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎప్పుడు ఏ దేశంతో శాంతి ఒప్పందం అంటారో.. ఏ దేశంతో యుద్ధం అంటారో తెలియని అయోమయ పరిస్థితుల్లో మార్కెట్ వర్గాలు ఉన్నాయి. దీంతో గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగిపోతున్నాయి. పైగా.. మన దగ్గర సంక్రాంతి, పెళ్లిళ్ల సీజన్ కావడం కూడా ఇందుకు మరో కారణమని నిపుణులు అంటున్నారు. త్వరలో 10 గ్రాముల బంగారం లక్షా 50 వేల కూడా చేరుకోవచ్చని, తగ్గడమనే ముచ్చట కనిపించడం లేదని పేర్కొంటున్నారు.

19 నుంచి మాఘమాసం

మాఘ మాసం అంటేనే పెళ్లిళ్ల సీజన్. ఈ నెల 19 నుంచి ఈ మాసం ప్రారంభం కానుంది. ఊరూ వాడా బ్యాండ్ భాజాభజంత్రీలు మోగనున్నాయి. నెలరోజుల పాటు వరుసగా శుభ ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెప్తున్నారు. ఈ నెల 23న శ్రీపంచమి కూడా ఉంది. మాఘ మాసం మ్యారేజీల సీజన్ కావడంతో పిల్లల పెళ్లిళ్ల కోసం తల్లిదండ్రులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పెరుగుతున్న బంగారం, వెండి ధరలను చూసి వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read Also: మ్యూచువల్ ఫండ్స్‌పై లోన్ తీసుకోవచ్చని మీకు తెలుసా!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>