కలం, వెబ్ డెస్క్: పార్టికల్6 సంస్థ సృష్టించిన ఏఐ నటి ‘టిల్లీ నార్వుడ్’ (Tilly Norwood) విడుదల చేసిన మ్యూజిక్ వీడియో తీవ్ర దుమారం రేపింది. హాలీవుడ్ భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తోంది. ‘టేక్ ద లీడ్’ పేరుతో వచ్చిన ఈ పాటలో, తాను నకిలీని కాదని, తనలోనూ సృజనాత్మకత ఉందని టిల్లీ పేర్కొనడం వివాదానికి దారితీసింది. గతంలోనే ఎమిలీ బ్లంట్ వంటి తారలు ఇలాంటి ప్రయోగాలను వ్యతిరేకించినా, సదరు సంస్థ ఈ పాటను విడుదల చేయడం గమనార్హం. ఈ పాట ఏఐ (AI) నటులందరినీ ఏకమవ్వాలని కోరుతూ, భవిష్యత్తు తమదే అని ప్రకటించేలా ఉంది. అయితే, మనుషులు ఎవరూ కనెక్ట్ కాలేని ‘ఏఐ బాధలను’ పాటగా మార్చడంపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. వేలాది మంది కళాకారుల డేటాను అనుమతి లేకుండా వాడి ఈ ఏఐ బొమ్మలను తయారు చేశారని విమర్శలు వస్తున్నాయి.
నటీనటుల సంఘం (SAG-AFTRA) ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించింది. టిల్లీ నార్వుడ్ ఒక నటి కాదని, కేవలం ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ మాత్రమేనని స్పష్టం చేసింది. దీనికి ఎటువంటి భావోద్వేగాలు ఉండవని, ఇలాంటి కంటెంట్ అసలైన కళాకారుల ఉపాధిని దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. మానవ కళాఖండాలను దొంగిలించి చేస్తున్న ఇటువంటి ప్రయోగాలు కళా ప్రపంచానికి ముప్పుగా పరిణమించాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ అకౌంటెంట్
Follow Us On: Youtube

