కలం, స్పోర్ట్స్: జపాన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో ప్రపంచ నంబర్ వన్ డబుల్స్ ప్లేయర్ కతెరీనా సినియాకోవా (Katerina Siniakova) ఛాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో ఆమె అమెరికాకు చెందిన ఆష్లిన్ క్రూగర్పై ఘన విజయం సాధించింది. కేవలం 64 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో సినియాకోవా 6-1, 6-0 తేడాతో విజయాన్ని అందుకుంది. టోర్నీలో ఒకే ఒక్క సెట్ కోల్పోయిన సినియాకోవా పీటన్ స్టెర్న్స్, కేటీ బౌల్టర్ వంటి కీలక క్రీడాకారిణులను ఓడించి ఫైనల్‌కు చేరింది. మరోవైపు ఆష్లిన్ క్రూగర్ టాప్ సీడ్ అన్ లీని ఓడించి ఈ సీజన్లో తొలిసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
ఫైనల్ మ్యాచ్ తొలి సెట్లో 2-1 ఆధిక్యంలో ఉన్న తర్వాత సినియాకోవా వరుసగా 10 గేమ్‌లు గెలుచుకుని మ్యాచ్‌ను ఏకపక్షం చేసింది. క్రూగర్ చేసిన 34 అనవసర తప్పిదాలు ఆమె ఓటమికి కారణమయ్యాయి. ఈ విజయంతో సినియాకోవా తన కెరీర్లో ఆరో డబ్ల్యూటీఏ సింగిల్స్ టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. 2023 నాన్‌చాంగ్ టోర్నీ తర్వాత ఆమెకు ఇదే తొలి సింగిల్స్ టైటిల్ కావడం విశేషం.
మ్యాచ్ అనంతరం సినియాకోవా మాట్లాడుతూ.. ఇంత బాగా ఆడిన సందర్భం గుర్తులేదని, తన ప్రదర్శనపై ఎంతో గర్వంగా ఉందని తెలిపింది. తదుపరి టోర్నీల కోసం గ్వాంగ్జౌ, ఆపై ఇండియన్ బౌల్ ఫైనల్స్‌కు ప్రయాణమవుతున్నట్లు వెల్లడించింది.

