కలం, యాదగిరిగుట్ట: ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో వీధి లైట్లలో భారీ చీకటి స్కామ్ (Yadagirigutta Streetlights Scam) జరిగింది. మార్కెట్ ధర కంటే నాలుగు రెట్లకుపైగా బిల్లులు పెంచి చెల్లించారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. తక్కువ ధరకు లభించే స్ట్రీట్లైట్లను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు చూపి ప్రజాధనం నొక్కేశారనే వ్యవహారం తెరపైకి వచ్చింది. నిజానికి హైదరాబాద్‌లోని హోల్‌సేల్ మార్కెట్లో రూ.640కే లభించే 36 వాట్ల ఎల్ఈడీ స్ట్రీట్‌లైట్‌కు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఏకంగా రూ.2,750 చొప్పున బిల్లు చెల్లించినట్లు తేలింది. రెండు ధరలను పోల్చి చూస్తే ఒక్కో లైట్‌పై ఏకంగా రూ.2,110 వ్యత్యాసం ఉంది.
వాస్తవ ధరతో పోలిస్తే మున్సిపాలిటీ చెల్లించిన బిల్లు నాలుగు రెట్లకు పైగా ఉండటం గమనార్హం. ఒకే బ్రాండ్, ఒకే స్పెసిఫికేషన్, ఒకే వారంటీతో కూడిన లైట్లకు సంబంధించినవేనా? లేదా బిల్లులో రవాణా, ఫిట్టింగ్, ఇన్స్టాలేషన్, ఇతర సేవల ఖర్చులు కలిపి ఉన్నాయా? అనేది అధికారిక రికార్డుల పరిశీలన ద్వారా తేలాల్సి ఉంది. ఒకవేళ ఇన్స్టాలేషన్ ఖర్చులు ఉన్నాయని అధికారులు చెబుతున్నా, ఒక్కో లైట్ బిగించడానికి రూ.2,110 ఖర్చవుతుందా? అనేది స్పష్టత లేదు. కేవలం అంచనా కోసం చూపిన లెక్కలే అయినప్పటికీ, మున్సిపాలిటీకి చెందిన పర్చేజ్ ఆర్డర్లు, బిల్లులు, స్టాక్ రిజిస్టర్లను బయటకు తీస్తే అసలు అక్రమాలు తేలే అవకాశం ఉంది.
కమిషనర్‌కు తెలిసే జరిగిందా..?
మున్సిపల్ లైట్ల కొనుగోళ్లలో ధరలను ఎవరు నిర్ణయించారు? కొటేషన్లు సేకరించారా? ఓపెన్ టెండర్ ప్రక్రియ జరిగిందా? స్థానిక, హోల్‌సేల్ మార్కెట్ ధరలతో పోల్చారా? కొనుగోలు బిల్లులను ఎవరు పరిశీలించి ఆమోదించారు? సరఫరా చేసిన లైట్ల నాణ్యతను ఎవరు తనిఖీ చేశారు? అనే ప్రశ్నలకు మున్సిపల్ అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సి ఉంది. ఈ వ్యవహారంలో మున్సిపల్ కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులు, పాలకవర్గం బాధ్యత ఏంటనేది అంతుచిక్కడం లేదు. కొనుగోలు ఫైళ్లు, ఆమోదాల ప్రతిపాదనలు, చెల్లింపుల వాచర్లను పరిశీలించి, బాధ్యత ఎవరిదో సమగ్ర విచారణ ద్వారా నిర్ధారించాల్సిన అవసరం ఉంది. సంబంధిత అధికారులు కూడా ఈ ధరల వ్యత్యాసంపై అధికారిక వివరణను బహిర్గత పరచాల్సి ఉంది.
సమగ్ర విచారణ జరిపితే..
ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేటాయించే పన్నుల నిధులు దుర్వినియోగం కాకుండా సమర్థంగా వినియోగించాలి. వీధి దీపాల కొనుగోళ్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నందున ఉన్నతాధికారులు, జిల్లా విజిలెన్స్ యంత్రాంగం తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు, స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే సంబంధిత కొనుగోలు రికార్డులను స్వతంత్రంగా తనిఖీ చేసి, నిబంధనల ఉల్లంఘనలు, అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడమే కాకుండా, దుర్వినియోగమైన ప్రజాధనాన్ని రికవరీ చేయాలని కోరుతున్నారు.
రూ.640, రూ.2,750 మధ్య ఉన్న భారీ వ్యత్యాసం వెనుక అసలు కారణమేంటి? కొనుగోలు ప్రక్రియలో నిబంధనలు పాటించారా లేదా? అనే ప్రశ్నలకు అధికారులే సమాధానం చెప్పాలి. ప్రజాధనం దుర్వినియోగం కావడంపై స్థానిక ప్రజలు, ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి మున్సిపాలిటీ కొనుగోలు రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు, పర్చేజ్ ఆర్డర్లను స్వాధీనం చేసుకుని సమగ్ర విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులతో పాటు సంబంధిత కాంట్రాక్టర్లు, ఏజెన్సీలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, దుర్వినియోగమైన ప్రజాధనాన్ని రికవరీ చేయాలని కోరుతున్నారు.
Also Read : పసిఫిక్‌లో రికార్డు టెంపరేచర్.. ‘ఎల్ నినో’ మరింత తీవ్రతరం!
Follow Us On: Youtube

