కలం, తెలంగాణ బ్యూరో: యాసంగి సాగుపై రైతుల్లో టెన్షన్ మొదలైంది. సాగు నీళ్లు ఇవ్వలేమని, వరి సాగు చేయొద్దని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆరుతడి పంటలు, పప్పు ధాన్యాలు పండించాలని సూచించింది. కానీ కూరగాయలు, పప్పుధాన్యాలు సాగు చేస్తే కోతులు (Monkey Menace) ఉంచవని రైతుల్లో ఆందోళన నెలకొన్నది. స్థానిక ప్రభుత్వ యంత్రాంగం సైతం కోతుల బెడదను నివారించలేక సతమతమవుతున్నది. గతంలో ప్రత్యేకంగా కోతులను పట్టేవాళ్లని నియమించి, వాటిని గ్రామాల నుంచి అడవులకు తరలించే చర్యలు చేపట్టినా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. రైతులే చొరవ తీసుకుని కొండెంగలను (కొండముచ్చులు) ఆశ్రయించినా, అలాంటి డ్రెస్సులతో పహారాకాసినా.. అది కొంతవరకే వర్కవుట్ అయింది.
దీంతో వరికి బదులుగా ఏ పంట వేసినా.. కోతుల నుంచి కాపాడుకోవడం కష్టమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. వేరే పంటలు వేస్తే నిత్యం కాపలా కాయాల్సి ఉంటుందని.. వందల సంఖ్యలో గుంపులు గుంపులుగా వచ్చే కోతులను తరిమేయడం సాధ్యం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం కనిపించక తలలు పట్టుకుంటున్నారు.
పంట మార్పిడిపై ప్రభుత్వాలు గతంలోనూ ప్రతిపాదనలు చేశాయని, కానీ కోతుల కారణంగానే ధైర్యం చేయలేకపోయామని రైతులు అంటున్నారు. ఇప్పటికే అడవి పందులు, ఇతర వన్యప్రాణులతో చిక్కులు వస్తున్నాయని.. ఇప్పుడు కోతుల సమస్య ఇబ్బందికరంగా మారిందని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో 11 జిల్లాల్లో కోతుల సమస్య తీవ్రంగా ఉండగా, మరో 9 జిల్లాల్లో ఓ మేరకు ఉన్నదంటూ జిల్లాల పంచాయతీ అధికారులు గతంలో నిర్వహించిన సర్వేలో తేలింది. ఐదేళ్ల క్రితమే (2021) ప్రభుత్వం కోతుల సమస్య తీవ్రతపై సర్వే నిర్వహించింది. ఇటు పంచాయతీరాజ్ అధికారులు, అటు వ్యవసాయ శాఖ అధికారులు.. ఈ సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వాటి నియంత్రణకు ప్రభుత్వం చాలా రకాలుగా ఆలోచించినా శాశ్వత పరిష్కారానికి సమగ్రమైన కార్యాచరణను రూపొందించలేకపోయింది. దీంతో పంటల మార్పిడి ఆలోచన ఆచరణ రూపం దాల్చలేదు. వ్యవసాయ, పశుసంవర్థక, అటవీ శాఖల సమన్వయంతో కోతుల నియంత్రణపై అధ్యయనానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినా.. గ్రామస్థాయిలో కోతుల గణన చేపట్టే ప్రయత్నాలు జరిగినా పురోగతి లేకుండాపోయింది.
సోలార్ ఫెన్సింగ్‌కు ఖర్చు ఎక్కువ
రాష్ట్ర వ్యవసాయ శాఖ, రైతు కమిషన్ జూన్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఖమ్మం, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో కోతుల బెడద తీవ్రంగా ఉన్నట్లు తేలింది. మరో తొమ్మిది జిల్లాల్లో ఒక మోస్తరుగా ఉన్నట్లు వెల్లడైంది. కోతులతో పాటు అడవి పందులు, జింకలు కూడా పంటలను ధ్వంసం చేస్తున్నాయని వ్యవసాయ శాఖ, రైతు కమిషన్ ప్రభుత్వానికి వివరించాయి. దీనికి విరుగుడుగా పంటల రక్షణకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుపై ప్రభుత్వానికి సూచనలు చేశాయి. వీటిని ఏర్పాటు చేసుకునే రైతులకు ప్రభుత్వం తరఫున సబ్సిడీ ఇవ్వాలని ప్రతిపాదించాయి. యావరేజ్‌గా ఒక్కో ఎకరానికి రూ.35 వేల వరకు ఖర్చవుతుందని అంచనా వేశాయి. మూడు ఎకరాల్లోపు సాగు భూమి ఉన్న చిన్న రైతులకు సాయం అందించాలని సూచించాయి. భువనగిరి జిల్లా తుర్కపల్లిలో స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థల సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల సహకారంతో కొందరు రైతులు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి ఏర్పాట్లు రాష్ట్రవ్యాప్తంగా రైతులకు అందుబాటులోకి వస్తే పంట మార్పిడి విధానాన్ని సక్సెస్‌ఫుల్‌గా అమలు చేయవచ్చు.
కోతులను పట్టుకునేందుకు పంచాయతీల చొరవ
గ్రామాల్లోని పంటలకు కోతుల సమస్య తీవ్రంగా ఉండడంతో రైతుల విజ్ఞప్తి మేరకు కొన్ని గ్రామపంచాయతీలు వాటిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా వ్యక్తులను నియమించుకున్నాయి. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో గతంలో కోతులను పట్టించేందుకు బిహార్ నుంచి ప్రత్యేక బృందం వచ్చి సుమారు మూడు వేల కోతులను పట్టుకుని అడవుల్లో వదిలిపెట్టింది. కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామపంచాయతీ కోతులను పట్టేవారితో ఒప్పందం కుదుర్చుకున్నా ఒక్కో కోతిని పట్టుకోవడానికి వెయ్యి రూపాయలు ఖర్చవుతుండడంతో గ్రామపంచాయతీలకు ఈ ఖర్చు మోయరాని భారంగా మారింది. కోతులను పట్టుకోవడం, తరలించడం లాంటి చర్యలు వన్యప్రాణి సంరక్షణ చట్ట నిబంధనలకు అనుగుణంగా జరగాల్సి ఉంటున్నందున గ్రామపంచాయతీలు, వ్యవసాయ శాఖ, అటవీ శాఖల మధ్య సమన్వయం తప్పనిసరిగా మారింది. మంత్రులు ఇటీవల నిర్వహించిన కొన్ని జిల్లాల సమీక్షా సమావేశాల్లో రైతులు కోతుల సమస్యను ప్రస్తావించారు. మెదక్ జిల్లా చేగుంటలో మంత్రి వివేక్‌కు రైతులు వివరించారు. మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, కూరగాయలు, పండ్లతోటల సాగుకు కోతులు, అడవి పందులు, జింకలు, పక్షుల బెడద అడ్డంకిగా ఉన్నట్లు తెలిపారు.
కోతులు నాశనం చేసే పంటలివే
కోతులు ఎక్కువగా తీపిదనం కలిగి, మెత్తగా ఉండే పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలను ప్రధానంగా టార్గెట్ చేస్తాయి. కూరగాయల విషయానికి వస్తే.. టమోటా, వంకాయ, బెండకాయ, చిక్కుడు, సొరకాయ, పొట్లకాయ, దోసకాయ, కాకరకాయ, బీరకాయ, గుమ్మడితో పాటు బంగాళాదుంప, బీట్రూట్, క్యారెట్ పంటలకు కోతుల ద్వారా భారీగా నష్టం వాటిల్లుతోంది. ఇక పప్పుధాన్యాలు, ఇతర వాణిజ్య పంటల్లో జొన్న, మొక్కజొన్న, సజ్జలు, వేరుశనగ, పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్), చెరకు, కందులు, మినుములు, పెసర్లు, శనగలు, పుచ్చకాయలను సైతం కోతులు పాడు చేస్తాయి.
ప్రభుత్వానికి, రైతులకు తలనొప్పి
గ్రామాల్లోనే కాకుండా పట్టణాల్లోనూ కోతుల సమస్య తీవ్రంగానే ఉన్నది. అడవిలో ఉన్నప్పటితో పోలిస్తే గ్రామాల్లోకి వచ్చినప్పుడు వాటి ప్రవర్తన భిన్నంగా ఉంటున్నది. పంటలకు నష్టం చేయడంతో పాటు మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో వాటిని తరిమే క్రమంలో బావుల్లో పడి రైతులు చనిపోతున్నారు. మరికొన్ని సందర్భాల్లో వాటి దాడి కారణంగా కింద పడి గాయాలపాలవుతున్నారు. వందల సంఖ్యలో వస్తుండడంతో వాటిని పొలాల నుంచి తరిమేయడం రైతులకు కష్టంగా మారింది. కొన్నిచోట్ల కొండెంగ డ్రెస్ వేసుకుని రైతులే కోతుల్ని తరిమే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు రైతులకూ, అటు ప్రభుత్వానికీ కోతుల సమస్యను పరిష్కరించడం సవాలుగా మారింది. కోతులకు అడవుల్లో తినేందుకు పండ్లు లేకపోవడంతో గ్రామాల్లోకి వస్తున్నాయని భావించిన గత ప్రభుత్వ ‘హరితహారం’ స్కీమ్‌లో భాగంగా అడవుల్లో పండ్ల మొక్కలు మొలిసేలా ఏరియల్ సీడ్ బాల్స్ విధానం చేపట్టింది. కానీ గ్రామాల నుంచి ఆ కోతులు అడవుల్లోకి వాపస్ పోలేదు. ఆశించిన ప్రయత్నం ఫలితాలను ఇవ్వలేదు. ఇప్పటికీ కోతుల సమస్య తీరలేదు.

