కలం, తెలంగాణ బ్యూరో: ఎల్ నినో కారణంగా కరువు (Telangana Drought) మండలాలను గుర్తించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే మొదలుపెట్టింది. అప్పటి పరిస్థితుల ప్రకారం తొలుత 235 మండలాలు కరువుబారిన పడినట్లు నిర్ధారణకు వచ్చింది. ఆ తర్వాత లోటు వర్షపాతం, ఎల్ నినో తీవ్రత పెరగడం, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ బాగా పడిపోవడం.. వీటితో కరువు మండలాల సంఖ్య తాజాగా 315గా తేలింది. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు రాష్ట్ర అధికారి ఒకరు తెలిపారు.
మరో 43 మండలాలు సైతం దాదాపుగా ఆ స్థాయికి చేరువగా ఉన్నాయని, వీటిని కూడా ప్రత్యేక కేసుగా పరిగణించి ఆ జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకు కేంద్ర నిబంధనల్లోని కొన్ని అంశాలను ప్రస్తావించాలనుకుంటున్నది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం సందర్భంగా రాష్ట్రంలోని ఎల్ నినో తీవ్రత, కరువు పరిస్థితులపై మంత్రులు, వారి శాఖల తరఫున అధికారుల నుంచి వచ్చిన వివరాలను పరిగణలోకి తీసుకున్నది.
శాస్త్రీయ విశ్లేషణతో గుర్తింపు
ఆయా మండలాల్లోని కరువు పరిస్థితులను శాస్త్రీయంగా విశ్లేషించి కేంద్ర నిబంధనల ప్రకారం అర్హత ఉన్నవాటినే జాబితాగా రూపొందించాలని కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలను కలెక్టర్లకు జారీచేసింది. ఆ ప్రకారం కేబినెట్ సబ్ కమిటీ ఫస్ట్ మీటింగ్ నాటికి 315 మండలాల పేర్లు ఖరారయ్యాయి. మరో 43 మండలాల్లో అలాంటి పరిస్థితులే (20% కరువు) ఉన్నప్పటికీ నిబంధనల్లో అన్ని ప్రమాణాలకు సరిపోయేలా లేకపోవడంతో కొన్ని అదనపు వివరాలను జోడించి అక్కడ కూడా కరువు ఏ స్థాయిలో ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వం వివరించాలని అనుకుంటున్నది.
ఇందుకోసం వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అంచనా వేసిన పంట నష్టం, భూగర్భ నీటి మట్టం పడిపోవడం, లోటు వర్షపాతం నమోదు కావడం అనే అంశాలను వివరించడంతో పాటు వాటిని ధృవీకరించేలా కొన్ని ఆధారాలను సమర్పించాలని భావిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా సగటున 24% లోటు వర్షపాతం నమోదైనందున నిర్దిష్టంగా ఆ 43 మండలాల్లోని వర్షపాతాన్ని ప్రస్తావించనున్నది. దీనికి తోడు సమీపంలో ఉన్న రిజర్వాయర్లలోని కనీస స్థాయి నీటి నిల్వలు, భూమిలోని తేమ శాతం, పంటల సాగు పరిస్థతి, పంటల ఆరోగ్యం తదితరాల గురించి కూడా పేర్కొననున్నది.
ఈ నెల 31 నాటికి జాబితా
రాష్ట్ర ప్రభుత్వ అంచనా ప్రకారం.. మొత్తం 358 కరువు మండలాలు ఖరారు కానున్నట్లు ప్రాథమిక అంచనా. ఈ నెల 31వ తేదీ నాటికి తుది జాబితాను రూపొందించడం, అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడం, కేంద్ర ప్రభుత్వానికి పంపడం పూర్తి కావాలని కేబినెట్ సబ్ కమిటీ గడువు విధించుకున్నది. మొత్తం 33 జిల్లాలకు గాను 18 జిల్లాల్లో కనిష్ట వర్షపాతం నమోదైంది. 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం (నార్మల్ కంటే 20% తక్కువైనా సాధారణంగానే గుర్తిస్తారు) నమోదైంది.
ఇప్పటి వరకు క్షేత్రస్థాయి అధ్యయనం ప్రకారం 324 మండలాల్లో భూగర్భ జలాల మట్టం ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలో 235 మండలాల్లోని కరువును దృష్టిలో పెట్టుకుని రూ.20 వేల కోట్ల మేర కేంద్రం నుంచి ఆర్థిక సాయాన్ని పొందాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కరువు మండలాల సంఖ్య ఇప్పుడు దాదాపు 360కు చేరుకుంటున్నందున ఈ సాయాన్ని మరింత పెంచి కేంద్రానికి సమర్పించే నివేదికలో ప్రతిపాదించనున్నది.

