సీఎంఆర్ బియ్యం కుంభకోణం.. నలుగురు మిల్లర్ల అరెస్ట్

​కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ సరఫరాలో చోటుచేసుకున్న కుంభకోణంపై తెలంగాణ సీఐడీ (Telangana CID)  ఉక్కుపాదం మోపింది. ప్రత్యేక బృందాలు ఆదివారం తెల్లవారుజామునే హుజూరాబాద్, జమ్మికుంట డివిజన్లలో ఆకస్మికంగా దాడులు నిర్వహించి నలుగురు రైస్ మిల్లర్లను అదుపులోకి తీసుకున్నాయి. హుజూరాబాద్ పట్టణానికి చెందిన వరలక్ష్మీ రైస్ మిల్ యజమాని కల్లూరు కృష్ణమూర్తి, జమ్మికుంట పట్టణానికి చెందిన వ్యాపారులు మల్లికార్జున్, సంపత్, మధును అదుపులోకి తీసుకున్నారు. వీరిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం.

సన్న బియ్యం స్థానంలో దొడ్డు బియ్యం..

​ప్రభుత్వానికి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి పంపాల్సిన సీఎంఆర్ బియ్యం కేటాయింపుల్లో ఈ వ్యాపారులు నిలువునా మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ​పౌరసరఫరాల శాఖ నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి నాణ్యమైన సన్న బియ్యాన్ని పంపించాల్సి ఉండగా, సదరు మిల్లర్లు తక్కువ నాణ్యత గల దొడ్డు బియ్యాన్ని సరఫరా చేసినట్లు విచారణలో వెల్లడైంది. ​నాణ్యమైన బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయించుకుంటూ, ప్రభుత్వానికి మాత్రం నాసిరకం బియ్యం పంపిస్తూ రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు.

సర్కార్ సీరియస్ కావడంతో..

​ఖజానాకు నష్టం కలిగించడమే కాకుండా ఎఫ్‌సీఐ నిబంధనలను తుంగలో తొక్కిన ఈ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కుంభకోణం వెనుక అసలు సూత్రధారులు, పాత్రధారులను తేల్చాలని సీఐడీని ఆదేశించింది. రంగంలోకి దిగిన అధికారులు మొదటి రోజే కీలక వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ క్రమంలో​ రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన హుజూరాబాద్, జమ్మికుంట ధాన్యం మార్కెట్లలో బడా మిల్లర్లను నేరుగా అదుపులోకి తీసుకోవడంతో మిగిలిన రైస్ మిల్లుల యజమానుల్లో గుబులు మొదలైంది. అధికారుల పాత్ర, ఇతర మిల్లర్ల ప్రమేయం కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ లోతుగా జరిగితే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>